Congress: జాతీయ బీసీ నేత క్రిష్ణయ్య పయనమెటు? బీజేపీలోకి వెళతారా? కాంగ్రెస్ గూటికి చేరుతారా? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ బీసీ నాయకుడిగా ఆయనను గౌరవించి వైఎస్ జగన్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి సముచిత గౌరవం కల్పించారు. కానీ పదవీ కాలం ముగియకముందే ఆయన రాజీనామా చేయడం కారణాలు ఏమై ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జాతీయస్థాయిలో బీసీ కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కృష్ణయ్య చెప్పారు. బీసీ ఉద్యమం గ్రామస్థాయికి చేరిందని, బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపును సాధించడానికి ఆందోళలను ఉధృతం చేస్తామంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. వారిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామా చేసినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఆర్.కృష్ణయ్య రాజీనామా అంశం చాలామందిని ఆశ్చర్యపరిచింది. బీసీలకు జగన్ పెద్ద పీట వేశారని అన్న ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతూ కూడా జాతీయస్థాయిలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపుకోసం కొట్లాడవచ్చు. ఇతర నాయకులతో కలిసి కృషి చేయవచ్చు. కానీ ఉన్నపదవికి రాజీనామా చేసి ఆయన గ్రామస్థాయి నుంచి బీసీల రాజకీయ ఉద్యమాన్ని ఉధృతం చేస్తానంటున్నారు.అక్కడే అనుమానాలు కలుగుతున్నాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో టీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్యను ఎల్బీనగర్ నుంచి పోటీలో నిలిపింది. ఆయన గెలిచారు కూడా. కానీ ఐదేళ్ల పాటు బీసీల సమస్యల కంటే ఇతర అంశాలపై దృష్టి సారించారు. వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేసే నాటికి ఆయన యాక్టివిటీ కూడా పెద్దగా ఏమీ లేదు. అయితే బీజేపీ మొన్నటి బీసీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీసీ సీఎం వాదాన్ని ముందుకు తెచ్చింది. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పింది. ఆయన రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని కోరింది. జాతీయ స్థాయిలో కీలక పదవి ఆఫర్ చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ తర్వాత మందకృష్ణ మాదిగ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీకి ఓటు వేయాలని కోరారు. భవిష్యత్తులోనూ ఆయన బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ఆర్.కృష్ణయ్యను కూడా కలుపుకుంటే బీసీ, ఎస్సీ ఓటర్లను గణనీయంగా తమవైపు తిప్పుకోవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా బీజేపీ లైన్‌లో మాట్లాడుతున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కృష్ణయ్యను కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎంపీ మల్లు రవి ఆహ్వానించారు. ఈ మేరకు విద్యానగర్ లోని ఆర్. కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఆయనతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సూచన మేరకే మల్లు రవి ఆయనతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిక పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మల్లు రవితో చెప్పినట్లు సమాచారం. అయితే జాతీయపార్టీల్లో చేరేకంటే బీ బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కృష్ణయ్య పై బీసీ సంఘాల ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థి ఉద్యమాల నుంచి కెరీర్ మొదలుపెట్టిన ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమనాయకుడిగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో తనకంటూ ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. అందుకే జాతీయపార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్లో బీసీల కోసం పార్టీ పెడితే ఏ మేరకు ప్రభావం ఉండొచ్చు అనేది చూడాలి. ఎందుకంటే స్వతంత్రంగా ఉన్నప్పుడు లేదా వేరే పార్టీలో ఉన్నా ఆయనను బీసీ ఉద్యమనాయకుడిగానే చూశారు. ఆయనపై రాజకీయ విమర్శలేమీ పెద్దగా ఎవరూ చేయలేదు.రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చాలామంది బీసీ నాయకులు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చాలాకాలంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సొంతంగా పార్టీ పెడితే ఎంతమంది ఆయనతో కలిసి వస్తారన్నది చూడాలి.