Revanth Reddy : అప్పుడప్పుడు కాకుండా నిత్యం అప్పే. రాష్ట్రం నడిచేది అప్పుల ఇంధనంతో. తెల్లారితే చాలు మళ్లీ చెయ్యి చాచడమే. పని మొదలు పెట్టాలంటే అప్పు పుట్టాల్సిందే. ప్రగతేమోగానీ, నెత్తిన అప్పుల కుంపటి మాత్రం తప్పడం లేదు ప్రజలకు. రికార్డు స్థాయిలో అప్పులు చేసిన ఘనత కు రేవంత్ సర్కార్ వెళ్లిందంటే ఏ రేంజ్ లో రుణాలు తీసుకుంటున్నారో చూడొచ్చు. ఆదాయం, వ్యయాలతో సంబంధం లేకుండా ఎడాపెడా అందిన కాడికి డబ్బులు గుంజుకొస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాలపై గగ్గోలు పెట్టిన రేవంతుడు.. ఇప్పుడు తన పాలనలో మాత్రం అప్పులేనిదే ముద్దముట్టడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రజాపాలన దేవుడెరుగానీ, ప్రజా జీవనం అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆగమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత చేసినా ఓ కొత్త ప్రాజెక్టో, పథకమో ప్రారంభించారా అంటే అదీ లేదు. కాంగ్రెస్ సర్కార్ చేసే అప్పులు ప్రతి నెలా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
అధికారానికి వచ్చిన నాటి నుంచి అప్పులతోనే పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. వచ్చే నెల ఒకటో తేదీన మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కసరత్తు ప్రారంభించింది. రూ.1,500 కోట్ల విలువైన బాండ్‌ను 15 ఏండ్లకాలానికి, రూ.500 కోట్ల విలువైన బాండ్‌ను 18 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ రిజర్వు బ్యాంకుకు జారీచేసింది. ఈ బాండ్‌ను అక్టోబర్ ఒకటిన ఆర్బీఐ వేలం వేయనున్నది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు అధికారం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు రూ.71,495 కోట్ల అప్పు చేసింది. వచ్చే రూ.2,000 కోట్లతో కలిసి రాష్ట్ర రుణం రూ.73,495 కోట్లకు చేరుతుంది. ఈ నెల 3న రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు, 17న రూ.500 కోట్లు.. ఇలా నెల వ్యవధిలోనే రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ 1న మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోనున్నది. ప్రతి నెలా రూ.5 వేల కోట్ల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.69,012 కోట్ల అప్పులు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్‌లో వివరించింది. కానీ, ఇప్పటివరకు బాండ్ల వేలం ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి రూ.31 వేల కోట్ల రుణాలు సేకరించింది. అంటే ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టుకున్న లక్ష్యంలో సగానికిపైగా అప్పును కేవలం 5 నెలల్లోనే చేసిందన్నమాట. దీంతో మిగతా 7 నెలల్లో రేవంత్ సర్కారు రాష్ట్ర ప్రజల నెత్తిపై ఇంకెంత అప్పుల మూటను పెడుతుందోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.