Tuesday, October 8, 2024

Revanth Reddy: తొమ్మిది నెలల్లో అప్పులు రూ.76 వేల కోట్ల.. రేవంత్ సర్కారు ఉక్కిరిబిక్కిరి

- Advertisement -

Revanth Reddy: తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పులమయంగా మారిపోయిందని కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఆరోపిస్తూ వచ్చాయి. బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారని కూడా ఆరోపణలు చేశాయి. అప్పుల పేరుతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేశారని కూడా చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే పాలన చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని రెట్టింపు చేశారా? అని అటాక్ చేయడం ప్రారంభించింది బీఆర్ఎస్. దీంతో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ సర్కారుకు కొత్త షాక్ తగులుతోంది. తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా..76 వేల కోట్ల రూపాయలుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీనే అధికారం చేపట్టగా.. మూడోసారి కాంగ్రెస్ సర్కార్ అధికారం రుచిచూసింది. అయితే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా అప్పుల విషయంలో.. నిత్యం విమర్శిస్తూనే ఉంది. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను.. అప్పుల కుప్పగా మార్చేశారని దుయ్యబడుతూనే ఉంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రతి పనిలో అవినీతి చేసిందని.. లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలపై తీవ్ర భారం వేసిందంటూ విమర్శలు చేస్తోంది. కేసీఆర్ సర్కార్ చేసిన అడ్డగోలు అప్పులకు.. రాష్ట్రంలో వచ్చే ఆదాయం వడ్డీ కట్టేందుకే సరిపోతుదంటూ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు దానిపైనే రివర్స్ కౌంటర్ అటాక్ ప్రారంభించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో చేసిన అప్పుల చిట్టా పద్దుపై సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి పదే పదే ప్రస్తావించే సీఎం రేవంత్ రెడ్డి.. 9 నెలల్లోనే.. ఏకంగా 75,995 వేల కోట్ల అప్పు చేసినట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. నెలలు, తేదీలతో సహా ఎప్పుడెప్పుడు ఎంతెంత అప్పు తీసుకున్నారనేది సోషల్ మీడియాలో క్లియర్‌గా పోస్టుల రూపంలో పేర్కొంటున్నారు.

జులైలో జులైలో రూ.7000 కోట్లు, ఆగస్టులో రూ.6000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయగా.. సెప్టెంబర్ 3వ తేదీన 1000 కోట్లు అప్పు తీసుకుంది. కాగా.. నిన్న మరో 1500 కోట్లు అప్పు చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రేవంత్ సర్కార్ మొత్తం రూ.75,995 కోట్లు అప్పు చేసినట్టు చెప్తున్నారు. అందులో కేవలం బాండ్లు తాకట్టు పెట్టే రూ.46,118 కోట్లు అప్పు చేసినట్టుగా పేర్కొంటున్నారు. ఇక మిగతా రూ.29,877 కోట్లు వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పు తీసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తీసుకొనున్న 1500 కోట్లు కూడా బాండ్ల వేలం ద్వారానే ఆర్బీఐ నుంచి తీసుకోనుందని పోస్టులు పెడుతున్నారు.

గత ఏడాది డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అక్కడకు ఐదురోజులకే అంటే.. డిసెంబర్ 12వ తేదీ నుంచి రేవంత్ ప్రభుత్వ అప్పులు చేయటం మొదలు పెట్టిందంటూ పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ శ్రేణులు.. అప్పటి నుంచి ఈరోజు వరకు రేవంత్ సర్కార్ చేసిన అప్పుల చిట్టా పద్దును సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి ఈ చిట్టా పద్దులో ఎంత వరకు నిజముందనేది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే చెప్పాలి మరి. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పెడుతున్న అప్పులకు కౌంటర్ ఇవ్వలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆ పార్టీ శ్రేణులు మల్లుగుల్లాలు పడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!