Janasena – Tdp :ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల్లో విభేదాలు బయటపడ్డాయి. తాజాగా జనసేన నేత చేసిన కామెంట్స్ అటు ప్రభుత్వంతో పాటు, పార్టీలను సైతం ఇరుకు పెట్టేలా ఉన్నాయి. జనసేన నేత బొలిశెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ఉద్యమంలో కొందరు నేతలు నటిస్తున్నారని బొలిశెట్టి తెలిపారు. ఆయన అక్కడితో ఆగకుండా కార్మిక సంఘాల నేతలను దొంగలతో పోల్చారు. కార్మిక సంఘాలు దొంగ ఉద్యమాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
అలాంటి వారిని చాచిపెట్టి కొట్టాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు అఖిలపక్షం వేయమని అడగడం లేదని కార్మిక సంఘాల నేతలను ఆయన ప్రశ్నించారు. ఉత్తిత్తి ఉద్యమాలు చేయడం కాదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలంటే కార్మికులు గట్టిగా పోరాడాలని జనసేన నేత బొలిశెట్టి కోరారు.ఎవరో ఒకరు తప్ప మిగతా కార్మిక నేతలంతా తప్పు చేస్తున్నారన్నారు. అప్పట్లో ప్రైవేటీకరణ విషయం తెలియగానే పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. ఇది సెంటిమెంట్ తో ఏర్పాటైందని తెలిపారు.
అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసం ఎవరూ ఉద్యమాలు మొదలుపెట్టలేదని, పవన్ ఢిల్లీ వెళ్లారని తెలియగానే కార్మిక నేతలు దుకాణాలు తెరిశారని గుర్తుచేశారు. దొంగ ఉద్యమాలు సరిగా జరగడం లేదని మళ్లీ పవన్ ఢిల్లీ వెళ్లేందుకు అఖిలపక్షం వేయాలని కోరారన్నారు. ఇప్పటికైనా అఖిలపక్షం ఏర్పాటు చేసి కార్మిక నేతలు సహా అందరినీ ఢిల్లీ తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఇప్పుడు చంద్రబాబును అఖిలపక్షం కోసం కార్మిక నేతలు నిలదీయాలని బొలిశెట్టి సత్య సూచించారు.
బొలిశెట్టి వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో ఉన్నాం కదా అని ఏది పడితే అది మాట్లాడితే బాగుండదని జనసేన నాయకులను టీడీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మిక సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి బొలిశెట్టి సత్యనారాయణ అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు.బీజేపీకి తొత్తులుగా మారి స్టీల్‌ప్లాంట్‌ను మట్టుబెట్టాలని చూస్తే ఊరుకోమని కార్మిక సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.