Sunday, October 13, 2024

Telangana Elections: నోటిఫికేషన్ రాకుండానే తెలంగాణలో సర్పంచ్ ఎన్నిక.. అధికారులకు షాక్

- Advertisement -

Telangana Elections: తెలంగాణలో ఇంకా స్థానిక సంస్థల నగారా మోగలేదు. ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. కుల గణన పిటీషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. కేసు కోర్టులో ఉండగా ఎన్నికలు నిర్వహించే సాహసం ప్రభుత్వం చేయదు. పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో ఎన్నికలు పూర్తయ్యేలా లేవు. నాలుగైదు నెలలు ఆలస్యంగా జరిగే అవకాశముంది. మరోవైపు పంచాయతీలకు ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. అయితే సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి నడిచింది. గ్రామస్థులంతా ఒక వ్యక్తి ని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయోత్సవాన్ని సైతం జరుపుకున్నారు. రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

ఈ ఏడాది జనవరితో తెలంగాణలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన నడుస్తోంది. దీంతో గ్రామాల్లో అభివ్రద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాది ఇదే పరిస్థితి. గ్రామంలో సుమారుగా 883 మంది జనాభా ఉంటారు. వీరిలో అటూ ఇటుగా 700 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అయితే నిధుల సమస్యతో గత పాలకవర్గం హయంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. దీంతో గ్రామంలో చాలావరకు సమస్యలు పేరుకుపోయాయి. దానికి తోడు గ్రామంలో గ్రామ దేవతలైన బొడ్రాయి, పోచమ్మ, ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవటంతో అరిష్టాలు జరుగుతున్నాయనే అపోహ తండా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇటీవల వరుసగా కొందరు యువకులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవటమే అందుకు కారణం. దీంతో గ్రామస్థులంతా ఈ సమస్యలపై చర్చించారు. బొడ్రాయి పండగ నిర్వహించటంతో పాటు ఆలయాలు నిర్మించిన వారిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు.

గ్రామసర్పంచ్ గా తనకు అవకాశం కల్పించాలని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. గ్రామస్థులంతా ఒప్పుకుంటే తానే సర్పంచ్‌గా ఉంటానని చెప్పాడు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. సొంత డబ్బులతో బొడ్రాయి, పోచమ్మ, ఆంజనేయుడికి ఆలయాలు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. బొడ్రాయి పండుగ ఖర్చు కోసం తండాలోని ప్రతి ఇంటికి రూ.1000 చొప్పున కానుకగా పంచిపెడాతనని చెప్పాడు. రానున్న ఎన్నికల్లో తండాలో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు. బాలాజీ కండీషన్లకు గ్రామస్థులంతా ఒప్పుకున్నారు. ఈ మేరకు గ్రామంలో మీటింగ్ పెట్టుకుని అగ్రిమెంట్ పేపర్ కూడా రాసుకున్నారు.

గ్రామస్థులు కోరిన మేరకు మూడు ఆలయాలు, ఇంటికి రూ. 1000 చొప్పున ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్న బాలాజీ గ్రామస్థులకు మరో షరతు పెట్టాడు. సర్పంచ్ ఎన్నికల సమయంలో కేవలం తన ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని అన్నాడు. ఈ కండీషన్ అతిక్రమించి ఎవరైనా నామినేషన్ వేస్తే రూ.50 లక్షల వరకు ఫైన్ విధించాలన్నాడు. ఈ కండీషన్ కూడా అగ్రిమెంట్‌లో రాయించాడు. ఒప్పంద పత్రంపై బాలాజీతో పాటుగా గ్రామ పెద్దలు సంతకాలు పెట్టారు. అనంతరం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందంటూ రంగులు పూసుకొని సంబరాలు చేసుకున్నారు.

ఈ ఒప్పంద పత్రంపై ఇరుపక్షాల వారు సంతకాలు చేయగానే, సర్పంచ్​ అభ్యర్థితో పాటు గ్రామస్థులంతా రంగులు జల్లుకుని వేడుకలు చేసుకున్నారు. బయట గ్రామాల వారికి ఇది ఒక వింత సంస్కృతిలా అనిపించినా, తండాల్లో ఈ తంతు వ్యవహారం మామూలుగానే నడుస్తోందట. ఇలా తమ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఎన్నిక జరిగితే సమస్యలన్నీ ముందే పరిష్కారం అవుతాయని ఆ తండావాసులు చెబుతుండటం గమనార్హం.అయితే విషయం తెలుసుకున్న అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆరాతీసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే తెలంగాన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నట్టు ఈ ఘటనతో అర్ధమైంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!