Telangana : తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోందా? కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో అసంత్రుప్తి మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పరిణామాలే తాజాగా వెలుగుచూస్తుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. తమది ప్రజాపాలన అని.. ప్రజలకు ఎటువంటి ఆంక్షలు ఉండవని.. ప్రతిపక్షాలపై ఉక్కుపాదాలు మోపమని చెప్పుకొచ్చింది రేవంత్ సర్కారు. కానీ క్రమేపీ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఏడాది పాలన పూర్తికాకుండానే ప్రజల్లో ప్రభుత్వంపై వైఖరి మారుతోంది. మున్ముందు ఇది తీవ్రరూపం దాల్చే అవకాశముంది.
రేవంత్ సర్కారుకు పది నెలలు అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న కంచెలను తొలగించారు. ఇది గొప్ప మార్పుగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు అదే ప్రజా భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ కంచెలు వచ్చాయని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోన్నాయి. రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్, రైతు సంఘాలు చలో ప్రజా భవన్ కు పిలుపు నిచ్చాయి.ఈ నేపథ్యంలో ప్రజా భవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరోవైపు చలో ప్రజా భవన్ కు రాకుండా బీఆర్ఎస్ నేతలు, రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. గతం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు పలు హామీలు ఇచ్చింది.ఇందులో రూ.2 లక్షల రుణ మాఫీ, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయాలని డిమాండ్ పెరిగింది. దీంతో రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేయాలంటే రూ.31 వేల కోట్లు అవసరం అని తేల్చారు. ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. మూడు దశల్లో రుణ మాఫీ చేశారు.అయితే చాలా మంది రైతులకు ఇంతవరకు రుణ మాఫీ కాలేదు.దీంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపునకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుండడం విశేషం.
వాస్తవానికి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కాంగ్రెస్ పార్టీని ఎంతో నమ్మారు. అందుకే ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. మిషన్ భగీరధతో చెరువులు, కాలువలను బీఆర్ఎస్ సర్కారు ఆదునీకరించింది. సాగునీటిని పుష్కలంగా అందించింది. రెండు పంటలు పండించేలా చేసింది. అయినా సరే రుణమాఫీ వంటి పథకాలకు రైతులు ఆశపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. దాదాపు గ్రామీణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. అయితే ఇప్పుడు రైతులు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ అమలుకాలేదని అసంత్రుప్తితో రగిలిపోతున్నారు.
రుణమాఫీ చేశామని రేవంత్ సర్కారు ఆర్భాటం చేస్తోంది. అదో ప్రచార అస్త్రంగా మార్చుకుంది. కానీ రుణమాఫీకి ప్రభుత్వం కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి. దాదాపు సగానికిపైగా రైతులకు రుణమాఫీ వర్తించేలేదని తెలుస్తోంది. మిగతా వారికి రుణ మాఫీ చేయమంటే చేయడం లేదని.. అందుకే చలో ప్రజా భవన్ కు పిలుపునిచ్చిట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతన్నారు. ఇప్పటికీ అన్నదాతలకు రుణ మాఫీ చేయకుంటే కాంగ్రెస్ ను ఎవరూ కూడా నమ్మరని అంటున్నారు. కాగా రైతు భరోసా కూడా ఇవ్వడం లేదని రైతు సంఘాలు మండి పడుతున్నాయి. మొత్తానికైతే ఏడాది తిరగక ముందే రేవంత్ సర్కారు రైతుల ఆగ్రహాన్ని మూటగట్టుకోవడం విశేషం.