AP Government: ఇటీవలే కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మరోసారి ముందస్తు ఎన్నికల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా అధినేత ఆరా మస్తాన్ పలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయన స్పందించారు. ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచే ఫారం- 20 గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. పోలింగ్ ముగిసిన 48 గంటల్లోగా ఎన్నికల ఫారం-20ని ఈసీ తన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంటుంది. సాధారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇదే పద్దతి అవలంభిస్తారు. కానీ, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వంద రోజులకు ఫారం-20 ఎందుకు అప్‌లోడ్ చేశారో చెప్పాలని ఆరా మస్తాన్ ప్రశ్నించారు.
మరోవైపు, దేశంలో జమిలి ఎన్నికల వాతావరణం ఏర్పడనున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీ జవాబు ఇవ్వాలని కోరారు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు రాకూడదనే కోరుకుంటోంది. ఎందుకంటే.. మళ్లీ ఉన్నఫళంగా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికారం కోల్పోతామేమోననే భయం వల్ల అయి ఉండొచ్చు. కాగా, గత ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ జరిగింది? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి? నోటాకి ఎంత మద్దతు లభించింది? ఎంత కౌంటింగ్ జరిగింది? లాంటి విశ్లేషణలతో కూడిన ఫారం-20ని 48 గంటల్లోగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలా కాకుండా ఏపీలో కూటమి అధికారం చేపట్టిన 100 రోజులకు పెట్టడం వెనక పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి ప్రజలకు సరైన సమాచారం అందించాలని ఆరా మస్తాన్ కోరారు.