Friday, October 4, 2024

Gannavaram: గన్నవరం గరం.. గరం.. మళ్లీ లొల్లి షురూ.. ఏం జరుగుతోంది?

- Advertisement -


Gannavaram: ఏపీలో రాజకీయంగా అతి ముఖ్యమైన నియోజకవర్గం గన్నవరం. ముఖ్యంగా అధికార టీడీపీకి గన్నవరమే అడ్డా… 2019 ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ లోనూ గన్నవరంలో సైకిల్ జెండా రెపరెపలాడింది. ఆ ఎన్నికల తర్వాత అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై టీడీపీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేనికి చుక్కలు చూపించేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేసి ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావును గెలిపించారు. గతంలో వైసీపీలో పనిచేసిన యార్లగడ్డ 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు. దీనికి కారణం టీడీపీ నేతల ప్రత్యేక దృష్టి అయితే.. వంశీపై అలుపెరగని యార్లగడ్డ పోరాటమేనని అంటున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వంద రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ల నుంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పరంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక కేటాయింపులు జరుగుతున్నాయి. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో టీడీపీకి చెందిన కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులపై ఎమ్మెల్యే యార్లగడ్డ ఫైర్ కావడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు, కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న చలసాని ఆంజనేయులు గత ఎన్నికల్లో తనకు సహకరించలేదని వైసీపీ నేతలతో రాజీపడ్డారని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో చలసాని ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సహకార డెయిరీలను ధ్వంసం చేసేందుకు పెద్దలు పాచికలు వేసినా ఆంజనేయులు విజయ డెయిరీని కాపాడారన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. అయితే సరిగ్గా ఇదే అంశంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ఆరోపణలు చేయడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో తనకు మద్దతుగా ప్రచారం చేయలేదని ఆరోపించడంతో పాటు వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని తనకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ విమర్శలు గుప్పిస్తూ నిప్పులు చెరుగుతున్నారు వెంకటరావు. అలా అని ఒక్క చలసానిని టార్గెట్ చేయడమే కాకుండా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గానికి గతంలో ప్రాతినిథ్యం వహించిన గద్దె రామ్మోహన్ తనకు తెలియకుండానే తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతో ఈ విషయంలో ఎవరికి సర్దిచెప్పాలో తెలియక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

ఎమ్మెల్యే యార్లగడ్డ తొలిసారి విజయం సాధించారు. ఇతర నేతలతో పోలిస్తే రాజకీయంగా జూనియర్. కానీ, సీఎం చంద్రబాబుకు ఆ నేతల కంటే యార్లగడ్డే ముఖ్యమని చెబుతున్నారు. అయితే యార్లగడ్డ విమర్శలను ఎదుర్కొంటున్న నేతలు సైతం సీఎంతో నేరుగా మాట్లాడేంత చనువు ఉన్న వారు కావడంతో ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనన్న టెన్షన్ టీడీపీలో కనిపిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే ముక్కుసూటి వ్యవహారం.. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యే మనస్తత్వం వల్లే ప్రతీదీ వివాదాస్పదం అవుతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్నీ తన ఇష్టప్రకారమే జరగాలనుకోవడం గన్నవరం టీడీపీలో ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే ఎవరికి ఎలా చెప్పుకోవాలో సీఎం కూడా మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. 30 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న చలసాని ఆంజనేయులు, తాను పోటీ చేయామంటే అక్కడ పోటీ చేసి పార్టీ ప్రతిష్టన పెంచే ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్… ఈ ఇద్దరికీ మించి అన్నట్లు తన ప్రతిష్టను పెంచేలా గెలిచిన యార్లగడ్డ మధ్య సీఎం చంద్రబాబు నలిగిపోతున్నారని చెబుతున్నారు. యార్లగడ్డ మనస్తత్వం తెలిసిన బాబు… వెంటనే పిలిచి చెబితే నొచ్చుకుంటారనే ఆలోచనతో వేచిచూద్దామని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన స్పీడ్‌లో యార్లగడ్డ ఉన్నారని, మీరే సరిపెట్టుకోవాలని సీనియర్లకు అధినేత సూచనలు పంపినట్లు చెప్పుకుంటున్నారు. అయితే తుపాన్ ఎప్పుడయినా తీవ్రరూపం దాల్చబోతోందన్న ప్రమాద హెచ్చరికలు టీడీపీలో కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!