Andrapradesh: సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. పాలనాపగ్గాలు చేపట్టి ఇటీవలే వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. కానీ, ఏం లాభం? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా రాష్ట్రంలో సమస్యలు పెరిగాయి తప్ప సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదు. అభివృద్ధి మాట అలా ఉంచితే.. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోపిడీలే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సంగతి ఇక సరేసరి. అప్పుల్లో రాష్ట్రం మరోవైపు దానికి తోడు వరద విపత్తులో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక అప్పటి పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని పరిశీలిద్దాం.
సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక వంద రోజుల్లోనే 87 శాతం హామీలను అమలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. ఏపీలో సుపరిపాలన అందించి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఖజానాలో రూ.వంద కోట్లు మాత్రమే మిగిల్చి.. అప్పుల పాలు చేసి వెళ్లిపోతే వెనకడుగు వేయకుండా రాష్ట్ర బాధ్యతను, ప్రజా సంక్షేమాన్ని తన భుజాలపై మోసిన ఒకే ఒక్కడు వైఎస్ జగన్. అంతే కానీ, ఖజానా ఖాళీగా ఉందని ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ కాలయాపన చేయలేదు. ఏ రోజు కూడా హామీల అమలును వాయిదా వేయకుండా మేనిఫెస్టో అమలుకు నిరంతరం కృషి చేశారు. 2019, జూన్ 10న జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఆమోదముద్ర వేయడం చూస్తే అంత చిన్న వయసులో సీఎంగా పెద్ద బాధ్యతను మోశారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు సామాజిక న్యాయం, మహిళా సాధికారత, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసి ప్రజల మన్ననలు పొందారు.