Friday, October 4, 2024

Hydra : సీఎం తమ్ముడి కోసం హైడ్రా దూకుడు తగ్గిందా? కమిషనర్ ప్రకటన దేనికి సంకేతం?

- Advertisement -

Hydra : హైడ్రా.. ఈ మాట ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా ఆకర్షించింది రేవంత్ కొత్త ప్రాజెక్టు. హైడ్రా ముందు అందరూ సమానమేనని నిరూపిస్తూ కూల్చివేతలు సాగాయి. తాము టార్గెట్ చేసిన వారు ఎవరు? ఏమిటి? లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా బుల్డోజర్ తో సహా రంగంలోకి దిగటం.. నిర్మాణం ఏదైనా కుప్పకూల్చేయటమే ఇప్పటివరకు చేసింది. నాగార్జున, మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులు నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతల నిర్మాణాలను కూడా కూల్చివేశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వరంటూ హైడ్రా గురించి మండిపాటు వ్యక్తమవుతోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రంగంలోకి దిగి.. టార్గెట్ ఫినిష్ చేయటమే హైడ్రా ప్రత్యేకతగా ఆ సంస్థకు చెందిన వారు చెబుతుంటారు. కానీ హైడ్రా దూకుడు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాస్తా మినహాయింపులు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురవుతోంది.

రెండు రోజుల కిందట మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువు, బాచుపల్లికి సమీపంలోని మల్లంపేటలోని కత్వా చెరువు చేపట్టిన కూల్చివేతల అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుంచి సుదీర్ఘమైన ఒక మెసేజ్ అధికారికంగా వెలువడింది. సింఫుల్ గా సుత్తి లేకుండా సూటిగా ఒక్క లైన్ లో తేల్చి చెప్పాలంటే.. చెరువు ఎఫ్ టీఎల్.. బఫర్ ల్యాండ్ ల పరిధిలో ఉండే నివాసిన ఇళ్లను తాము టచ్ చేయమని పేర్కొన్నారు. వాటి గురుంచి తరువాత ఆలోచిస్తామని అన్నారు .. ఇప్పటివరకు వెనుకా ముందు చూడకుండా చెరువు స్థలాల్లోని నిర్మాణదారులకు చుక్కలు చూపించే హైడ్రా నోటి నుంచి వచ్చిన ఈ మినహాయింపు దేనికి సంకేతం? అన్నదిప్పుడు చర్చగా మారింది. హైకమాండ్ నుంచి ఆదేశాలైన వచ్చి ఉండాలి. లేకుంటే అస్మదీయులకు మేలు చేసేందుకైనా ఉండాలి. అయితే ఎక్కువ మంది మాత్రం రెండోదే అని స్థిర నిర్ణయానికి వస్తున్నారు.

దుర్గం చెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటిని కూల్చేయాల్సి ఉంటుందని.. ఈ కారణంతోనే ఈ మార్పు వచ్చిందన్న వాదన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. మొన్నటివరకు ఎవరిని పట్టించుకోని హైడ్రాకు.. ఇప్పుడు కొత్తగా మినహాయింపుల పర్వంలోకి ఎందుకు దిగినట్లు? అన్న చర్చకు సమాధానం గురించి ఆరా తీసినప్పుడు వస్తున్న సమాధానం ఏమిటంటే.. తాము ఇప్పటివరకు కూల్చేసిన కట్టడాలు.. నిర్మాణాలన్ని కూడా.. కమర్షియల్ నిర్మాణాలేనని.. కొన్ని గుడిసెల్ని కూల్చేసినప్పటికీ.. అవన్నీ కూడా కొందరు భూకబ్జాదారులు వేయించిన షెడ్లుగా చెబుతున్నారు. అయితే ప్రజల్లోకి వేరే సంకేతాలు బలంగా వెళుతున్నాయి. అస్మదీయుల కోసమే హైడ్రా దూకుడు తగ్గించిందన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది.

అయితే హైడ్రాపై ఢిల్లీ కాంగ్రెస్ గుస్సాగా ఉందని ప్రచారం సాగుతోంది. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడంగా భావిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం దిగాలుతో పాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం పడితే ప్రభుత్వం నడపడం కష్టమని కాంగ్రెస్ నేతలు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే తమ విజన్ మారలేదని.. సీఎం తమ్ముడి నిర్మాణం వరకు వచ్చేసరికి కావాలనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నది తప్పుడు చర్చగా హైడ్రా వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. నిజంగా అక్కడి వరకే వస్తే.. ముఖ్యమంత్రి తమ్ముడి ఇంటినైనా సరే కూల్చేసే ప్రజా ప్రభుత్వంగా చెబుతున్నారు. ఏమైనా.. ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నలకు కాలం సమాధానం చెబుతుందని.. హైడ్రా విషయంలో.. దాని లక్ష్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ చాలా చాలా క్లారిటీతో ఉన్నారని.. ఆయన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకునే పరిస్థితి ఉందంటున్నారు. అదెంత నిజమన్నది కాలమే సరిగ్గా సమాధానం ఇస్తుందని చెప్పక తప్పదు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!