Tuesday, October 8, 2024

Congress: వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు దక్కితే కాంగ్రెస్ లో పంట పండినట్టే

- Advertisement -

Congress: కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. ఆ పార్టీలో ప్రతీ పదవికి ఎంతో ప్రాధాన్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దీనికితోడు పదవి ఉంటే ఢిల్లీ పెద్దలతో ర్యాపో మెంటేయిన్ చేయవచ్చు. అందుకే కాంగ్రెస్ లో పదవి అంటేనే నాయకులు ఇట్టే ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి భర్తీ అయ్యింది. మంత్రివర్గ విస్తరణకు సైతం కసరత్తు జరుగుతోంది. మరోవైపు పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ఆ పోస్టు నాకంటే నాకు అంటూ నేతల మధ్యే పెద్ద పోరాటమే నడుస్తోంది. అయితే వరుస పదవుల భర్తీ నేపథ్యంలో పార్టీలో అసంత్రుప్త స్వరాలు, ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వారిని కాకుండా.. మధ్యలో పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం దక్కుతుండడంతో ఒరిజినల్ హస్తం శ్రేణులు కుతకుతలాడుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు. కానీ ఫస్ట్ టైమ్ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మొట్టమొద‌టిసారిగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేశారు. అయితే ఈ పోస్టుకు ఒక సెంటిమెంట్ నడుస్తోంది. ఈ పోస్టును ఎవ‌రు ద‌క్కించుకుంటే వారిని అదృష్టం అతుక్కుపోతుందనే టాక్‌ ఉంది. టి.కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారంద‌రికి ఆ త‌ర్వాతి కాలంలో మంచి మంచి అవ‌కాశాలు వచ్చాయని చెబుతున్నారు. ఇది గుడ్డి నమ్మకం కాదని… క‌ళ్ల ముందు క‌నిపించే వాస్తవమంటూ ఉదాహకరణలతో సహా వివరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన‌ సమయంలో పీసీసీ చీఫ్‌గా పొన్నాల ల‌క్ష్మయ్యకు ఛాన్స్ ద‌క్కింది. అప్పుడు మొట్ట మొద‌టి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి అవ‌కాశం ల‌భించింది. ఆ త‌ర్వాత జ‌న‌ర‌ల్ ఎల‌క్షన్స్‌లో పార్టీ బ‌ల‌హీన ప్రదర్శన కార‌ణంగా అధిష్టానం పొన్నాల‌ను త‌ప్పించింది. అప్పటి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కు పీసీసీ చీఫ్‌గా ఛాన్స్ ఇచ్చింది. అలా పీసీసీ చీఫ్ ఛాన్స్ ద‌క్కించుకున్న ఉత్తమ్‌.. దాదాపు ఏడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగారు.

అప్పట్లో పేరుకే పొన్నాల లక్ష్మయ పీసీసీ అధ్యక్షుడు కానీ.. ఉత్తమ్ కుమార్ మాట ఎక్కువగా చెల్లుబాటు అయ్యేది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పీసీసీ చీఫ్‌గా పనిచేసిన ఉత్తమ్‌కు పార్టీలో పట్టు బాగా పెరిగింది. ఢిల్లీ పెద్దల వద్ద కూడా మంచి గుర్తింపే ఉంది. అలా పార్టీలో ముఖ్యమైన నేత‌ల్లో ఒక‌రుగా ఉత్తమ్ మారిపోయిన ఉత్తమ్‌ ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉత్తమ్‌ తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఛాన్స్ మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కకు ద‌క్కింది.ఆ త‌ర్వాత భ‌ట్టి సీఎల్పీ ప్రచార క‌మిటీ చైర్మన్‌గా, సీఎల్పీ లీడ‌ర్‌గా ఎంపికయ్యారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేసిన భ‌ట్టి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్‌2గా వ్యవహరిస్తున్నారు. భట్టి తర్వాత వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారిలో రేవంత్ రెడ్డి సీఎం అవ్వగా, పొన్నం ప్రభాక‌ర్‌కు మంత్రి యోగం పట్టింది. ఆఖ‌రికి మొన్నటికి మొన్న వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేష‌న్ ఇంచార్జ్‌గా ఉన్న మ‌హేష్‌కుమార్ గౌడ్ రాత కూడా మారిపోయింది. ఇప్పుడు ఆయ‌న పీసీసీ చీఫ్ ఛాన్స్ కొట్టేశారు.

అందుకే తెలంగాణలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్య పదవులు ఆశిస్తున్న నేత‌లంతా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కొంద‌రు నేత‌లైతే ఢిల్లీ లెవల్లో పైర‌వీ చేస్తున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఉన్న నేత‌లంద‌రితో దీని కోస‌మే ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే పార్టీ హైకమాండ్ ఇక్కడే కొత్త ఎత్తుగడలు వేస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాధాన్యం తగ్గించాలని భావిస్తోంది. అందులో భాగంగా న‌లుగురు లేదా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ను భ‌ర్తీ చేయాల‌ని చూస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా బీసీ నేతను నియమించడంతో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇతర సామాజికవర్గ నేతలకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వర్కింగ్‌ ప్రెసిడెంట్ల జాతకాలు తర్వాత మారిపోవడంతో చాలా మంది నేతలు ప్రస్తుతం ఢిల్లీకి క్యూ కడుతున్నారు.అయితే పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎత్తుల పైఎత్తులు కొనసాగుతున్నాయి. అయితే నేతల మధ్య క్రమశిక్షణ కట్టుదాటి అసలుకే ఎసరు తెస్తుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!