AP ELECTIONS : కేంద్ర కేబినెట్ తాజాగా జమిలి ఎన్నికలకు ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం మొదలైంది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు రాకూడదనే కోరుకుంటోంది. ఎందుకంటే.. మళ్లీ ఉన్నఫళంగా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అధికారం కోల్పోతామేమోననే భయం వల్ల అయి ఉండొచ్చు. టీడీపీ కూటమి వంద రోజుల పాలనలో ఇప్పటికే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి మళ్లీ ఎన్నికలంటే గుబులు పుట్టడంలో మరి ఏ సందేహం లేదని చెప్పొచ్చు. మరి గతంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా టీడీపీ ఇదే విధంగా మధ్యంతర ఎన్నికల పాటే పాడింది కదా. ముందస్తు అంటూ వైసీపీ అధికారం చేపట్టిన ఆరు నెలల నుంచే రోజుకో కొత్త రాగం తీసేది. అంతటితో ఆగకుండా తెలంగాణ ఎన్నికలతో ముడిపెట్టి గత ఏడాది వైసీపీ ముందస్తుకు వెళ్తుందని కూడా పెద్దఎత్తున ప్రచారం చేశారు. కానీ, ప్రజల అండదండలు ఉన్న వైసీపీ విషయంలో అవేవీ సాధ్యపడలేదు.
మరి తాజా పరిస్థితులను పరిశీలిస్తే.. గతంలో టీడీపీ తన రాజకీయ వ్యూహాలతో ముందస్తు అంటూ ప్రచారాలు ఊదరగొట్టింది. కానీ, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చింది. పైగా జమిలి ఎన్నికల ప్రచారం ప్రస్తుతం అధికారికమైంది. ఏకంగా కేంద్రమే ఇందుకు ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన సిఫార్సులను ఆమోదించింది. జమిలి ఎన్నికలతో అందరికీ ప్రయోజనమే అని కోవింద్ తాజాగా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడం కష్టతరం అనుకుందేమో టీడీపీ.. మధ్యంతర ఎన్నికలు అనగానే చేతులెత్తినంత పని చేస్తోంది. కేంద్రం ఆమోదం తెలిపిన నుంచి జమిలిపై స్పదించకుండా కాలయాపన చేస్తోంది. అయితే.. వైసీపీ అధికారికంగా బయటకు చెప్పకపోయినా ప్రతిపక్షంగా జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకే లాభమని ప్రచారం సాగుతోంది. దాంతో వైసీపీ ముందస్తుకు తథాస్తు అంటుందని కూడా అంటున్నారు.