Pawan Kalyan-Jagan: వైసీపీ పొలిటికల్ స్టాండ్స్ కానీ స్ట్రాటజీస్ కానీ ఎప్పటికపుడు మార్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పవన్ విషయంలో వైసీపీకి ఏమీ అర్థం కావడం లేదు అని అంటున్నారు. ఆయనను టార్గెట్ చేస్తే ఒక తంటా లేకపోతే మరో తంటా అన్నట్లుగా ఏపీలో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అపరిమితమైన సినీ ఇమేజ్ ఉన్న వెండి తెర నాయకుడు, పైగా ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. దాంతో పవన్ తో పెట్టుకుంటే ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో అన్నది వైసీపీ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కళ్ళారా చూసింది. అందుకే పవన్ జోలికి వెళ్లరాదని వైసీపీ హై కమాండ్ నిర్ణయించినట్లుగా కూడా ప్రచారం సాగింది. సాక్ష్యాత్తు వైసీపీ అధినేత జగన్ పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించినప్పుడు కూడా చంద్రబాబునే విమర్శించారు కానీ పవన్ ని పల్లెత్తు మాట అనలేదు. పవన్ మీద మంత్రులుగా ఉన్నపుడు భారీ ఎత్తున విరుచుకుపడే గుడివాడ అమర్నాధ్ పేర్ని నాని వంటి వారు కూడా సైలెంట్ అయ్యారు. ఎంతగా అంటే పేర్ని నాని గుడివాడ వెళ్తే అక్కడ జనసేన క్యాడర్ ఆయన కారు మీద దాడి చేసినా కూడా ఆయన ఏమీ అనలేదు.
ఇదంతా దేని కోసం అంటే టీడీపీ కూటమిలో జనసేన ఈ రోజుకు ఉన్నా కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదని పవన్ ఏదోక రోజు టీడీపీ కూటమికి దూరం అవుతారని ఆయన సొంత రాజకీయం కోసం అయినా లేదా జనసేన కోరిక అయిన సీఎం పోస్ట్ కోసం అయినా చేస్తారు అని అంచనా వేసుకుంది. కానీ పవన్ ఎపుడూ చంద్రబాబుతోనే అని పదే పదే నిరూపిస్తూ వస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితులు ఎదురైన ప్రతీ సారీ పవన్ కళ్యాణ్ బాబుకు బాసటగా నిలుస్తున్నారు. లేటెస్ట్ గా శ్రీవారి లడ్డూలు కల్తీ అయ్యాయి అన్న ఇష్యూలో రాజకీయ దుమారం చెలరేగి ఆ తుఫాను కాస్తా వైసీపీ ముంగిటకు వచ్చి చేరింది. ఆయన ప్రాయశ్చిత్తం దీక్ష కానీ వైసీపీ మీద చేసిన హాట్ కామెంట్స్ అన్నీ వైసీపీ మూలాలనే తాకుతున్నాయి. పవన్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ తో ఆయన ఏమి చెప్పినా జనాలలోకి ఇట్టే చేరిపోతుంది. దాంతో పవన్ ఇప్పటిదాకా వైసీపీకి కులం దెబ్బ కొడుతూనే వచ్చారని ఇపుడు మతం దెబ్బ కూడా కొడితే టోటల్ గా అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ కలవరపడుతోంది. మాటి మాటికీ జగన్ ని క్రిస్టియన్ అని కార్నర్ చేస్తూ ఆయన హయాంలో దేవాలయాల మీద దాడులు జరిగాయని చెబుతూ చేస్తున్న హాట్ కామెంట్స్ తో వైసీపీ ఇబ్బందులలో పడుతోంది.
ఈ క్రమంలో పవన్ కామెంట్స్ కి సరైన కౌంటర్ ఇచ్చే మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సీన్ లోకి వచ్చారు. ఆయనను అలా వైసీపీ రంగంలోకి దింపింది అని అంటున్నారు. పవన్ కొత్తగా హిందూ మతం పుచ్చుకున్నారని అందుకే ఎక్కువ నామాలు పెట్టుకుంటున్నారు అని తనదైన శైలిలో పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ రష్యా చర్చిలో మోకాలి మీద కూర్చున్న తీరుని ప్రస్తావించారు. ఆయన తన పిల్లలకు క్రిస్టియన్ పేర్లు పెట్టారని కూడా గుర్తు చేసారు. అప్పట్లో భీమవరంలో తాను బాప్టిజం తీసుకున్నాను అని పవన్ చెప్పడాన్ని జనాలు గుర్తుంచుకుంటారు అని కూడా ఆయన అన్నారు. ఇక ఎప్పటికీ బాబు పవన్ జోడీ విడదీయడం అన్నది కష్టమని సో కేవలం బాబుని టార్గెట్ చేస్తూ వదిలేస్తే పవన్ రూపంలో డేంజర్ అలాగే పొంచి ఉంటుంది కాబట్టి ఆయనను కూడా గతంలో మాదిరిగానే టార్గెట్ చేయాలని వైసీపీ కొత్తగా నిర్ణయించింది అని ప్రచారం సాగుతోంది. ఈ రకమైన స్ట్రాటజీ తమ పార్టీకి మంచే చేస్తుందని, సనాతన ధర్మం ముసుగులో పవన్ కళ్యాణ్ నిజానిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ రకంగా ప్రజలకి ఆయన నిజ స్వరూపం బయటపెడితే తమకే మేలు జరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారట.