Sunday, September 8, 2024

AP CM Chandrababu:చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల కంటే కాదంబరి ఎక్కువైందా?!

- Advertisement -

AP CM Chandrababu: తుఫాను హెచ్చరికలను చంద్రబాబు సర్కార్ లైట్ తీసుకుంది. బాబు ప్రభుత్వం వైసీపీ నేతల్ని వేధించడంపై పెట్టే శ్రద్ధ ప్రజానీకంపై పెట్టలేకపోయింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు వైసీపీ నేతలను కేసుల్లో ఇరికించాలన్న అక్కసు వల్లే నేడు విజయవాడ ప్రజానీకం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత నెల 28న అమరావతి వాతావరణ శాఖ తుఫానుపై ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోవు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంశాఖ, విపత్తులశాఖ మంత్రి వంగలపూడి అనిత ఏ ఒక్క అధికారితోనూ అల్పపీడనంపై సమీక్షించిన పాపాన పోలేదు. ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కానీ ప్రభుత్వం ముంబయి నటి కాదంబరి సేవలో తరించడాన్ని చూడొచ్చు. కాదంబరిని అడ్డం పెట్టుకుని వైసీపీని బద్నాం చేయాలనే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలైంది. కాదంబరిని ఆగమేఘాలపై విజయవాడకు రప్పించడం వెనుక ప్రభుత్వం పాదరసంలా చురుగ్గా పని చేసింది. ఒక వైపు తుఫాను ఎఫెక్ట్ వర్షాలు మొదలైనా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాత్రం సినీ నటి కాదంబరిని గత నెల 30వ తేదీన సాయంత్రం 6.15 నుంచి రాత్రి 10.15 గంటల వరకూ విచారించడం గమనార్హం. అంటే నాలుగు గంటల సమయాన్ని కాదంబరి కోసం విజయవాడ సీపీ ఖర్చు చేశారు. తుఫానుపై మాత్రం అధికారులెవరూ సమీక్షించలేదు.

గత నెల 31న విజయవాడలో మేఘానికి చిల్లు పడ్డట్టుగా కుండపోత వర్షం కురిసింది. విజయవాడ నగరం ముంపునకు గురైంది. కాదంబరిపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధలో కనీసం పది శాతం అయినా తుఫాను హెచ్చరికలపై ప్రభుత్వం పెట్టి వుంటే ఈ స్థాయిలో నష్టం జరిగి వుండేది కాదు. తుఫాను హెచ్చరికలు అందుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, డ్యామ్ల పరిస్థితి ఏంటని సంబంధిత అధికారులను ఆదేశించి ఉంటే ప్రజానీకం వరద నీటి బారిన పడే వాళ్లు కాదనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రాధాన్యం వైసీపీని కేసుల్లో ఇరికించడం కావడంతో నటి కాదంబరి సేవలో అధికారులు తరించారు. చివరికి విజయవాడ ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందనేది చేదు నిజం. ఇదంతా గమనిస్తుంటే మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల కంటే కాదంబరి ఎక్కువైందనే వాదనలో నిజం ఉందని అనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!