Friday, October 4, 2024

Revanth reddy: టీపీసీసీ అధ్యక్ష పదవి మహేష్ కుమార్ ఎంపిక వెనుక కథ అదా?

- Advertisement -

Revanth reddy: ఉత్కంఠ వీడింది. కొద్ది నెలలుగా మేధోమధనం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణాకు కొత్త సారధిని నియమించింది. పీసీసీ చీఫ్ పదవికి పోటీపడినా చివరికి మహేశ్‌కుమార్‌గౌడ్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రేవంత్ రెడ్డి సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా జోడు పదవుల్లో కొనసాగుతూ వచ్చారు. చాలా రోజులుగా పీసీసీ అధ్యక్ష పీఠాన్ని భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకొని ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ను ఖరారు చేసింది. దీంతో తీవ్ర ఉత్కంఠకు తెరదించింది. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో విధేయతకే పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యమిచ్చి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

2021 జులై నుంచి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సేవలందిస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం పీసీసీ బాధ్యతల నుంచి తప్పించింది. కానీ చాలా రోజులు జాప్యం చేస్తూ వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెస్ మార్కు తాత్సారం కనిపిచింది.తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు పీసీసీ అధ్యక్షులుగా కొనసాగారు.ఇప్పుడు 4వ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2004 నుంచి 2014 మధ్యకాలంలో రెండు సార్లు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సమయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్‌ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరవాత అదే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు పార్టీపగ్గాలు అప్పగించడం విశేషం.

గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయడానికి మహేశ్‌కుమార్‌గౌడ్ టికెట్‌ ఆశించారు. అయితే కొన్ని సమీకరణాల వల్ల దక్కలేదు. కేసీఆర్ పోటీలో ఉండటంతో రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయడంతో.. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆ స్థానం నుంచి తప్పుకొని నిజామాబాద్‌కు మారాల్సి వచ్చింది. దీంతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అసెంబ్లీకి పోటీచేసే అవకాశం కోల్పోయారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2024 జనవరిలో ఆయనను ఎమ్మెల్సీగా పార్టీ ఎంపిక చేసింది.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న మహేష్‌కు ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనను పీసీసీ అధ్యక్షపీఠంపై కూర్చోబెట్టిందంటున్నారు. అదే మార్గం సుగమం చేసిందని చెబుతున్నారు.

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు పోటీపడ్డారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో.. పార్టీ- ప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం. అందుకే రేవంత్‌రెడ్డి ఏరికోరి ఆయనకు పదవి ఇప్పించుకున్నట్లు చెప్తున్నారు.విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చి పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమన్వయంతో పనిచేసుకుంటూ విధేయుడిగా ఉంటారనే పేరు పొందడం మహేష్‌కు కలసి వచ్చింది … ప్రస్తుత మంత్రివర్గంలో బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బలమైన వర్గంగా గుర్తింపు పొందిన గౌడ్ వర్గానికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైపు మొగ్గు చూపినట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!