Telangana:తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? లబ్ధిదారుల ఎంపిక ప్రామాణికం ఏంటి? సరళతరంగా ఉంటుందా? నిబంధనల పేరిట కోత విధిస్తారా? ఇప్పుడిదే హాట్ టాపిక్. కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. కుటుంబాల నుంచి వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆశావాహులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
అయితే కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి.కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ అర్హత పాటిస్తే తమకు రేషన్ కార్డు వస్తుందో? లెదో? అన్న సందేహం లబ్ధిదారుల్లో నెలకొంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే భూముల విషయంలో ప్రభుత్వ ఆలోచన కొంతమందిలో ఆందోళన కలిగిస్తోంది. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ ఒక్క నిబంధనతో వేలాది మందికి కోత పడుతుందని తెలుస్తోంది. అయితే ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లో ఆదాయ పరిమితులు పరిశీలించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.
ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈసారి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామని మంత్రుల సబ్ కమిటీ వెల్లడించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుండగా.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అక్టోబర్‌లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిచనున్నారు.