Chandrababu- Jagan: తిరుమల లడ్డూ పై వివాదం కొనసాగుతోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చ మొదలైంది. భక్తుల్లో ఆందోళన మొదలైంది. టీటీడీ మాజీ ఛైర్మన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వుతో పాటుగా అభ్యంతరకర పదార్ధాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ళ క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నాణ్యత పైన విమర్శలు వచ్చాయి. లడ్డుల్లో మునుపటి రుచి గానీ, సువాసన గానీ, నాణ్యత గానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ప్రస్తుత ఈవో దృష్టికి వచ్చినట్టు తెలిసింది.
దీన్ని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్‌కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందినీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. తాజా ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి బహిర్గతం చేసారు. తిరుమల దేవదేవుడి ప్రసాదం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నట్టు భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ ఉందనే ఆరోపణలు భక్తుల విశ్వాసాలను తీవ్రంగా గాయ పరిచేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం కోసం దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం అనేది చాలా నీచమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావని హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బా రెడ్డి అన్నారు. వైసీపీ మీద, జగన్ మీద దాడి చేయడం కోసమే స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించారని చెప్పడం అనైతికం, అపచారం, దుర్మార్గం అని వైసీపీ పార్టీ మండిపడుతోంది. రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆ దేవుడే శిక్షిస్తాడని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలలో నిజం లేదని స్వామి వారి చెంత ప్రమాణం చేయడానికి కూడా తాము సిద్ధమని పార్టీ ప్రకటించింది. దీంతో కావాలనే నీచమైన రాజకీయం చేస్తూ తిరుమల లడ్డూ పైన ఆరోపణలు చేసిన వారికి చాచి కొట్టినట్లు జగన్ సమాధానం ఇచ్చినట్లు ఉందని ప్రజానీకం అభిప్రాయ పడుతున్నారు.