Balineni Srinivas Reddy: ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిన్న ఆయన భేటీ అయ్యారు. ఇక తాను పార్టీలో చేరతానని అడిగిన వెంటనే ఒప్పుకుని తనను ఆహ్వానించినందుకు పవన్ కల్యాణ్‌కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు వెల్లడించారు. తనతో పాటు ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీలో పనిచేస్తానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయి జనసేన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
తాను జగన్‌ను బ్లాక్‌మెయిల్ చేసినట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయని అయితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడలేదని గుర్తు చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చానని వైఎస్సార్ మరణానంతరం మంత్రి పదవిని, కాంగ్రెస్ పార్టీని వదిలి జగన్ వెంట నడిచినట్లు పేర్కొన్నారు. జగన్‌ను నమ్మి తాను ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీలో పదవులు ముఖ్యం కాదని గౌరవం కావాలని ఈ సందర్భంగా బాలినేని స్పష్టం చేశారు. తాను జనసేనలో ఎలాంటి పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగానే చేరుతున్నట్లు చెప్పారు. తాను వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించడం తన వ్యక్తిత్వం కాదని చెప్పిన బాలినేని, కానీ తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం అందరి విషయాలు బయట పెడతానని హెచ్చరించారు.
కానీ బాలినేని పార్టీని వీడటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించకపోవడం ఆశ్చర్యకరం. బాలినేని పార్టీలో ఉన్న చాలా కీలకమైన మరియు సీనియర్ నాయకుడు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఇలా పార్టీ మార్పులు సహజమే అనే ధోరణిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో, ఎన్నికల ముందు ఒక నాయకుడికి టికెట్ ఇవ్వడం విషయంలో మరియు కొన్ని ఆస్తి తగాదాలు ఇలా పలు అంశాల పట్ల జగన్ మరియు బాలినేనికి పొరపచ్చాలు వచ్చాయని ఆయన పార్టీని వీడటంతో ఇక ఆ తలనొప్పులు ఉండవని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దరిద్రుడు పోవడమే బెటర్ అని పలువురు నేతలు భావిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాలినేని పార్టీని వీడటం గురించి ఎవరూ అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే జగన్ ప్రెస్ మీట్ పెట్టి బాలినేని పార్టీని వీడటం గురించి వైసీపీ పైన చేసిన ఆరోపణల గురించి స్పంది౦చనున్నారని పార్టీ శ్రేణుల సమాచారం.