YS Jagan: ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్సార్సీపీ నుంచి పలువురు కీలక నేతలు వలస బాట పట్టారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతానికి పెద్దఎత్తున కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు ప్రముఖ నేతలకు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమిస్తూ కీలక బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే జగన్ జిల్లాల వారీగా అధ్యక్షుల నియామకానికి చర్యలు చేపట్టారు. కానీ అది ఇంకా అసెంబ్లీ ఇంచార్జిల వరకు రాలేదు. ఈ మేరకు అధికార ప్రతినిధులుగా వైసీపీ నలుగురు పేర్లను ప్రకటించింది. భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, రోజా, శ్యామల ఇందులో ఉన్నారు. ఓటమి అనంతరం పార్టీలో కీలక పదవుల్ని భర్తీ చేస్తున్న జగన్.. ఇదే క్రమంలో అధికార ప్రతినిధుల విషయంలో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేర్లు మాజీ మంత్రి రోజా, యాంకర్ శ్యామల. మహిళా కోటాలో ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వగా.. ఇప్పటికే వారికి ఫైర్ బ్రాండ్లు అనే పేరు ఉంది. గత ఎన్నికల సమయంలో రోజా, శ్యామల పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించారు. చంద్రబాబు, పవన్‌లకు ధీటుగా సమాధానమిస్తూ ఈ ఇద్దరూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎన్నికల ఫలితాల తర్వాత రోజా సైలెంట్ అయ్యారనే ప్రచారం విపరీతంగా సాగింది. ఇటీవలే తిరుపతి జిల్లా నేతలతో జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో మళ్లీ రోజా క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు తెలియజేశారు. తాజాగా విజయవాడ వరదలపై కూడా రోజా చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని నిలదీసేలా ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజా తనదైన శైలిలో మాటలు విసురుతూ నిజాన్ని నిక్కచ్చిగా బయటపెట్టే తత్త్వం ఉండడంలో పార్టీలో కీలకంగా మారారు. ఇప్పుడు మరోసారి జగన్ నిర్ణయంతో రోజాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం మంచి పరిణామంగా తెలుస్తోంది.
ఇక యాంకర్ శ్యామల గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొని తనకంటూ ఒక ఫాలోయింగ్ పెంచుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ ఆమెకంటూ పార్టీపరంగా ఎలాంటి హోదా ఉండేది కాదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఆమెను చంపేస్తామని కూడా బెదిరింపులు వచ్చినా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ వెంటే కలిసి నడిచారు. ఈ క్రమంలో శ్యామల చూపిన ధైర్యానికి, పార్టీ కోసం చేసిన కృషికి ఇప్పుడు జగన్ కీలక పదవి ఇవ్వడం విశేషం. పార్టీ కోసం, నమ్మిన నేత కోసం ఆమె వాయిస్ ఎంత గట్టిగా వినిపిస్తారనేది గత ఎన్నికల సమయంలోనే నిరూపితమైంది. అయితే.. శ్యామల ఎంతోకాలంగా వైసీపీ మద్దతురాలిగా ఉన్నారు. శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి 2019 ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా, ఇటీవల 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తూ శ్యామల యాక్టివ్ అయ్యారు.