YS Jagan: 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి సుపరిపాలన అందిందో తెలిసిందే. తనదైన శైలిలో ప్రజా శ్రేయస్సు కొరకు ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మొహంలో చిరునవ్వు చూసిన నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పరుచుకుని అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న సమయంలో రాష్ట్రానికి అప్పులు, భారీ వరదలు దెబ్బ మీద దెబ్బగా మారాయి. ఏమి చేయాలో పాలుపోక చేతులెత్తేసి ప్రజలను అమాయకులను చేసింది ఈ ప్రభుత్వం. ఇది తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది. నిన్న శుక్రవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బాధిత ప్రజల కష్టాలు విన్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
వైసీపీ హయాంలో ప్రజల వద్దకే ప్రతి ఒక్కటీ డోర్ డెలివరీ ద్వారా అందించామని, ఇప్పుడు ఏది కావాలన్నా దిక్కు తోచని ప్రజలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారని జగన్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అయితే, సీఎం చంద్రబాబు ఫొటోలకే పరిమితమై డ్రామా ఆర్టిస్టుగా మారారని, పవన్ కంటే బాగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి అయినా ఇస్తున్నాడా అని నిలదీశారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 వంతున ఏటా రూ.36 వేలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానన్నాడు.. మరి ఇప్పుడు ఆ ఊసే లేదే అని ప్రశ్నించారు. తమ హయాంలో రైతులు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే 2019–24 మధ్య 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు ఉచిత పంటల బీమా కింద అందాయి. మా ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. చంద్రబాబు పెట్టిన రూ.715 కోట్ల బకాయిలను కూడా నాడు మా ప్రభుత్వమే చెల్లించిందని జగన్ ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.