Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాస్కీ గౌడ్ తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారా? పీసీసీ అధ్యక్ష పీఠం దక్కకపోవడమే అందుకు కారణమా? ముఖ్యంగా సీఎం రేవంత్ తీరుతోనే తనకు పదవి దక్కలేదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకంపై గత మూడు నెలలుగా సస్పెన్స్ నడిచింది. ఈ విషయంలో సీఎం రేవంత్ తో పాటు.. మిగతా మంత్రులు చాలాసార్లు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలు పార్టీ పెద్దలకు వినిపించారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం కోరగా.. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీలకు ఇవ్వాలని భావిస్తే ఎంపీ బలరాం నాయక్ కు ఇవ్వాలని తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు తెలిసింది.
అయితే మధు యాష్కీకి అనూహ్యంగా సీనియర్లు మద్దతు తెలిపినట్టు సమాచారం. ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పలువురు సీనియర్ నేతలు మాత్రం అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కీ గౌడ్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే రేవంత్ ఈ విషయంలో వేరే ఆలోచన పెట్టుకున్నారు. సీనియర్ నేత మధుయాష్కీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతారని.. మహేష్ కుమార్ గౌడ్ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.అయితే ఇక్కడ సీనియర్లు తమ లాజిక్ ను ప్రదర్శించారు. ఇన్ని రోజులు రేవంత్ ను బలంగా మద్దతు తెలిపారు మధు యాష్కీ. అదే మధు యాష్కీ ద్వారా రేవంత్ ను చెక్ చెప్పాలని బావించారు. ఆయనకే పీసీసీ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హై కమాండ్ మాత్రం సీఎం రేవంత్ ప్రతిపాదనకే జై కోట్టింది. మహేష్ కుమార్ గౌడ్ పేరును ఖరారు చేసింది.
మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు చేయడం వెనుక మరో కారణం ఉంది. రేవంత్ పీసీసీ పగ్గాలు చేపటిన మొదట్లో..సీనియర్ , రేవంత్ వర్గం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగిన సమయంలో.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పార్టీని సమన్వయం చేయడం ఆయనకు తాజాగా కలిసి వచ్చిన అంశంగా చెబుతున్నారు. కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించడంతో.. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిల తర్వాత నాల్గో పీసీసీ ఛీప్ గా నియమితులయ్యారు మహేష్ కుమార్ గౌడ్.కానీ ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న మధు యాష్కీ మాత్రం తీవ్ర అసంత్రుప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం మధు యాష్కీకి ఏ పదవి లేదు. ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. తనకు ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తనకు దెబ్బేశారని తెగ బాధ పడుతున్నారు.అయితే టీపీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన మధుయాష్కీ గౌడ్‌కు మరో పదవి దక్కడం ఖాయమని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీలో పెద్ద పదవి రాబోతుందంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.కానీ సీఎం రేవంత్ పై మాత్రం మధు యాష్కీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన సీనియర్లతో జత కట్టే అవకాశమున్నట్టు తెలుస్తోంది.