Vijayasai Reddy : వైఎస్సార్సీపీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది కేవలం 11 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ పార్టీ పునః వైభవానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదవుల భర్తీలో భాగంగా నియామకాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు చేపడుతూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీకి చెందిన ఒక్కో విభాగానికి పటిష్ట పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ సోషల్ మీడియా పగ్గాలు ఎవరికి అందించాలనే విషయమై అధిష్టానం సమాలోచనలు చేసింది. పార్టీ చేపట్టే కార్యక్రమాలు, పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని గురించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి.. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడం, సరైన రీతిలో సమాధానం చెప్పడంలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర వహిస్తుంది.
కాగా, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ సారి సోషల్ మీడియా విభాగం పగ్గాలు అందించాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. విజయసాయి రెడ్డికి గతంలో కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగాధిపతిగా, రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం పాటు పని చేసిన అనుభవం ఉంది. అయితే.. గతంలో జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయం గడపడం, బిజీబిజీగా ఉండడం వల్ల సోషల్ మీడియా విభాగాన్ని తప్పిస్తూ స్వల్ప మార్పులు జరిగాయి. కాగా, విజయసాయి రెడ్డి వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచే పార్టీకి విశేష సేవలు అందిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.