Chandrababu-Pawan: చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తనకు కావాల్సింది సాధించడంలో తనకంటే సిద్దహస్తుడైన రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో లేకపోవచ్చు. ఎందుకంటే ఇక మోడీతో మళ్లీ పొత్తుకు ఛాన్సే లేదనుకుంటే అందరూ అవాక్కయ్యేలా, ప్రత్యర్థులు నివ్వెరపోయేలా మోడీతో కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. 151 ఎమ్మెల్యేలతో తిరుగులేని నేత అనుకున్న జగన్ మోహన్ రెడ్డిని తన నవరత్నాలు అందుకుంటున్న ఓటర్ల చేతనే ఓడించగలిగాడు. అలాంటి జన బలం కేడర్ బలం ఉన్న నేతలతోనే కావాలనుకుంటే సంధి చేసుకోవడం లేకపోతే మట్టి కరిపించడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? చంద్రబాబు అనే మహావృక్షం నీడలో మొక్కగా ఉన్న తన పార్టీ ఎదుగుతుందా? ఈ విషయంలో రాజకీయవర్గాల నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. తన పార్టీ సభ్యులు నిలబడిన అన్ని స్థానాలు గెలిచినా పవన్ కళ్యాణ్ ఒక సామంతరాజు మాత్రమే అన్నట్టుంది పరిస్థితి.
వరద బాధితుల సహాయార్ధం సీఎం సహాయనిధికి సినీనటులు విరాళాలిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెక్కులు అందజేస్తున్నారు. బాలకృష్ణతో సహా విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్యమంత్రికే చెక్కులు అందజేసారు. ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకకపోతే తదుపరి ఛాయిస్ గా ఉపముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి ఇవ్వాలనుకోవచ్చు. చంద్రబాబు కాని పక్షంలో లోకేష్ వద్దకు వెళ్లి చెక్కును అందజేస్తున్నారు. ఆశ్చర్యమేంటంటే ఆ లిస్టులో సాయితేజ్ కూడా ఉన్నాడు. ఇదంతా గమనిస్తుంటే కావాలనే పవన్ కళ్యాణ్ ని బలవంతంగా లో- ప్రొఫైల్ లో ఉంచుతోంది తెదేపా అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మొన్న విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ విమర్శలకి కారణమైనా కూడా దాని వెనుక తెదేపా ఉందేమోనని అనిపిస్తోంది. మీరొస్తే జనం మీద పడతారు కనుక అధికారులు వద్దంటున్నారని యంత్రాంగం చేత నిజంగానే పవన్ కి చెప్పించి ఉండొచ్చు బాబుగారు. పవన్ మీడియాలో అదే చెప్పారు. కానీ అది తన మీదే బ్యాక్ ఫైర్ అయ్యింది. కానీ పిఠాపురం బాధితుల వద్దకు వెళితే నిజంగానే జనం ఎవరూ పెద్దగా మూగలేదు. పవన్ ని స్టార్ గా కంటే తమ ఎమ్మెల్యేగానే చూశారు తన నియోజకవర్గ ప్రజలు. అంటే తన నియోజకవర్గం పిఠాపురం తప్ప తక్కిన ఊళ్లల్లో పవన్ రాజకీయ ఉనికి ఉండకూడదనే విధంగా చుట్టూ ఒక కనిపించని కంచె కట్టి ఉండొచ్చు తెదేపా. పైగా వరదల వేళ బయటికి రాకపోతే జనం పవన్ నే విమర్శిస్తారు తప్ప వెనుక ఇదంతా జరగడానికి ఛాన్సు ఉ౦టుందని ఎవరూ ఆలోచించరు.
ఎక్కిన కుర్చీకి పవర్ లేదని అనిపిస్తున్నా బయటికి చెప్పుకోలేక పవన్ విలవిలలాడుతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. ఇందులో నిజ౦ ఎ౦తుందో తెలియదు కానీ పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో నెంబర్ వన్ చంద్రబాబైతే, నెంబర్ టు లోకేష్ బాబేనని జరుగుతున్న సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఇదంతా పవన్ కి తెలిసి కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియదు. కానీ తనని నమ్ముకున్న ఒక వర్గం, కార్యకర్తలు మాత్రం ఇది తెలిస్తే కుదేలవుతారు. తమ నాయకుడు పదవిలో ఉన్నా లేనట్టే అనే భావన వారిని ఇంకా కృంగదీస్తుంది. తమ నాయకుడిని గొప్ప ప్రజాసేవకుడిగా చూస్తూ, భవిష్యత్తులో ముఖ్యమంత్రైతే చూడాలని చాలా కలలుగంటున్నారు పవన్ అభిమానులు. కానీ ఇదంతా చూస్తుంటే అది జరగడం కష్టం. మొత్తానికి చంద్రబాబు రాజకీయానికి పవన్ విలవిలలాడుతున్నారని ప్రస్తుతం ఈ అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.