Thursday, October 3, 2024

Mahesh kumar Goud :కాంగ్రెస్ లో మరో అధికార కేంద్రంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

- Advertisement -

Mahesh Goud : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చరిత్ర మసకబారుతోందా? ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందా? ఎన్నికల హామీలు అమలుకావడం లేదని ప్రజల్లో అసంత్రుప్తి నెలకుందా? అందుకు దిద్దుబాటు చర్యలకు దిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీపరంగా సైతం ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సమీక్ష సమావేశాలకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి, సహ ఇంచార్జ్‌లు విశ్వనాథం, విష్ణు‌నాథ్‌లు హాజరవుతున్నారు. డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ మాజీలు, ఫ్రంటల్ చైర్మన్‌లు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి రోజు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశాల్లో ప్రధానంగా.. పలు అంశాలను ఏజెండాగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పై పీసీసీ అధ్యక్షుడు ఫోకస్ పెట్టారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందుకోసం కొత్త కార్యవర్గం విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో.. కార్యవర్గం విషయంలో కూడా అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలుపొందే దిశగా పార్టీ నేతలందరూ కలిసి పని చేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమీక్ష సమావేశాల్లో చర్చించనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో అతి ముఖ్యంగా పార్టీ నేతలకు కీలక విషయాన్ని నిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలనే దానిపై నేతలను గైడ్ చేస్తారంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అవుతున్నారని ఆ లోటు తీర్చేలా అందర్నీ యాక్టివ్ చేయనున్నారు.అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకూ నామినేటెడ్ పదవుల ఎంపిక చేయలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తిగా డిఫెన్స్ లో ఉన్నారు. తమకు భవిష్యత్ ఉండదని ఎక్కువ మంది భావిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చాలారకాల హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు విషయంలో నానా రకాల కొర్రీలు పెడుతోంది. అందుకే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. అది పతాక స్థాయికి చేరక మునుపే రుణమాఫీ తో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా బ్రీఫ్ చేయనున్నారు. రుణమాఫీ విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళాల పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న మంచి నిర్ణయాలపై ప్రజల్లో చర్చ పెట్టే విధంగా సమీక్షా సమావేశంలో నిర్ణయించనున్నారు. మొత్తం మీద పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మొట్ట మొదటి సమీక్షా సమావేశాలు కావడంతో.. పార్టీ నేతల్లో కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరో అధికార కేంద్రంగా మారే అవకాశముందన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!