Friday, October 4, 2024

Revant Reddy: పీసీసీ పీఠం సరే.. మంత్రివర్గ విస్తరణ రేవంత్ కు కత్తిమీద సామే

- Advertisement -

Revant Reddy: పీసీసీ అధ్యక్ష పీఠాన్ని భర్తీ చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణే మిగిలింది. అయితే పీసీసీ అధ్యక్షుడి విషయంలో తీవ్ర తర్జనభర్జన నడుమ మహేష్ కుమార్ గౌడ్ ను ఖరారు చేశారు. చివరి వరకూ సీనియర్ నేత మధు యాష్కీ గట్టిగానే నిలబడ్డారు. కానీ సీఎం రేవంత్ మాటే పనిచేసినట్టు తెలిసింది. మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆశావహులు అతి కొద్ది మంది మాత్రమే. కానీ మంత్రివర్గ విస్తరణలో ఆ ఛాన్స్ లేదు. ఆరు మంత్రి పదవులుంటే.. ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. ఒకరికి ఇస్తే మిగతా వారు అలక పాన్పు ఎక్కడం ఖాయం. ఎన్నికలకు ముందు పదవులు ఆపర్ చేసిన నేతలు, ఎన్నికలయయాక ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ మంత్రి పదవులు అకామిడేట్ చేయడం కత్తిమీద సామే..

మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. కానీ, ప్రస్తుతానికి 4 ఖాళీలను భర్తీ చేయాలని సీఎం భావిస్తున్నారట… అవసరం బట్టి మిగిలిన రెండు ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది మంత్రులు ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం నుంచి ముగ్గురు, ఉమ్మడి నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మంత్రులు ఉన్నారు. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. దీంతో తాజా మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రతిపాదనలు ఉన్నాయి. అదేవిధంగా సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌ నుంచి ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి బెర్త్‌ కన్ఫార్మ్‌ అయిందని టాక్‌ వినిపిస్తోంది.

ముదిరాజ్‌లను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఎన్నికల సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా పార్టీలోకి వచ్చే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిని ఆఫర్‌ చేశారు. దీంతో వాకాటి శ్రీహరి, రాజగోపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్‌ అయినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన రెండు మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావుతోపాటు గెడ్డం వివేక్‌ బ్రదర్స్‌ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. వెలమ సామాజికవర్గానికి చెందిన ప్రేమ్‌సాగర్‌రావుకు పదవిపై తర్జనభర్జన సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలమ సామాజికవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండగా, ఇంకొకరిని తీసుకోవడం సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి అండదండలతో ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక గెడ్డం బ్రదర్స్‌ మంత్రి పదవిని ఆశిస్తున్నా…. వారి కుటుంబానికి ఎంపీ టికెట్‌ ఇవ్వడం, ఎస్‌సీ సామాజికవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల గడ్డం బ్రదర్స్‌కు అవకాశాలు తక్కువే అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి సీనియర్‌ నేత పి.సుదర్శన్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది.

మరోవైపు మంత్రి వర్గంలో శాఖల మార్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సీఎం సహా మంత్రులందరి వద్ద రెండు లేదా అంతకంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. తాజా మంత్రివర్గ విస్తరణలో మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం. మార్పులు చేస్తే ఎవరికి ఏ శాఖను కేటాయిస్తారు.. కొత్తగా మంత్రివర్గంలో చేరే వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ కోటా కింద నామినేట్ చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం కోర్టులో ఉన్నందున తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని పీసీసీ భావిస్తోంది. అయితే ఏ విదంగా చూసుకున్నా మంత్రివర్గ విస్తరణ అనేది కచ్చితంగా సీఎం రేవంత్ పై ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!