HYDRA: హైడ్రా..హైడ్రా.. ఇప్పుడు తెలంగాణలో ఏ నోట విన్నా ఇదే మాట. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది ఈ వ్యవస్థ. అదే సమయంలో సామాన్యులు సైతం సమిధలుగా మారుతున్నారు. హైడ్రా బారిన పడుతున్నారు. కాయా కష్టం చేసుకొని పోగు చేసుకున్న సొమ్ముతో చాలా మంది ఇళ్లు కొనుగోలు చేశారు. వాటికి అధికారులు అనుమతులిచ్చారు. అంత సవ్యమని చెప్పి నిర్మాణదారులు ఇళ్లను విక్రయించారు. ఇప్పుడు అవి సక్రమంగా లేవని హైడ్రా కూల్చేస్తుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు. అయినా సరే రేవంత్ సర్కారు లెక్క చేయడం లేదు. హైడ్రాను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. అదే సమయంలో హైడ్రాను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున కోర్టులో పిటీషన్లు దాఖలవుతున్నాయి.
అయితే మున్ముందు ‘హైడ్రా’ ఇకపై మరింత దూకుడుగా వ్యవ హరించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. దీనిని చట్టబద్దం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నెలలో జరగనున్న కేబినెట్ సమావేశంలో హైడ్రాకు సంబంధించిన ముసాయిదా చట్టానికి ఆమోదం తెలపనున్నారు. అనంతరం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిని చట్టం చేయనున్నారు. దీంతో మరింత బలంగా హైడ్రా పనిచేయనుంది.ఇప్పటి వరకు చూసుకుంటే హైడ్రా దూకుడు పెంచడంతో అనేక మంది చేసిన ఆక్రమణలు కుప్పకూలిపోయా యి. దీంతో పలువురు హైకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. అప్పట్లోనే హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి.సర్కారు వివరణ ఇస్తూ జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అయితే చట్టబద్ధతపై మాత్రం ఇంకా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.సర్కారు మాత్రం హైడ్రాను చట్టబద్ధమైనదేనని చెబుతోంది.
హైడ్రా ఏర్పాటు విషయంలో రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించేందుకు సర్కారు ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని ఈ నెలలోనే మంత్రివర్గం ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీలోనూ ప్రవేశ పెట్టి ఆమోద ముద్ర వేయించనుంది. దీంతో వాల్టా, మున్సిపల్, జీహెచ్ఎంసీ, నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు హైడ్రాకు దఖలు పడనున్నాయి. ఇక గత శనివారం, ఆదివారం హైడ్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నగర శివారు ప్రాంతాల్లోని అనే క ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఈ సారి మాత్రం అవేవీ లేకుండానే.. శనివారం గడిచిపోయింది.
హైడ్రా పనితీరును అందరూ మెచ్చుకుంటూ.. స్వాగతిస్తున్నారు. చాలా వరకు జిల్లాల నుంచి కూడా తమ పరిధిలో ఏర్పాటు చేయాలని కోరారు. అయితే కొందరి నుంచి విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటూ చెబుతూ హైడ్రా కూల్చివేస్తోందని.. మరి అప్పుడు అధికారులు వాటికి ఎలా అనుమతులు ఇచ్చారంటూ బాధితులు నిలదీస్తున్నారు. అక్రమమే అయినప్పుడు పన్నులు ఎందుకు కట్టించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అనుమతులు ఇస్తేనే తాము నిర్మాణాలు చేపట్టామని.. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో హైడ్రాను రద్దు చేయాలంటూ తాజాగా తెలంగాణలో పిటిషన్ దాఖలు కావడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారాలను సవాల్ చేస్తూ నానక్‌రామ్ గూడకు చెందిన లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ముందస్తు సమాచారం లేకుండా.. ఎలాంటి నోటీసులు లేకుండా అమీన్‌పూర్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో సెప్టెంబర్ 3న వ్యవసాయక్షేత్రంలోని షెడ్లు కూల్చివేశారని ధర్మాసనానికి విన్నవించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ కట్టడాలను నేలమట్టం చేశారని వెల్లడించారు. దీనిపై హైకోర్టు ఫైర్ అయినట్లుగా తెలిసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. బాధితుల నుంచి వివరణలు తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ అధికారాలను సైతం ప్రభుత్వం హైడ్రాకు అప్పగించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమని విన్నవించారు. కాబట్టి హైడ్రాను వెంటనే రద్దు చేయాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.