Pavan- chandrababu:పిఠాపురంలో రాజకీయం ఊహించని ములుపులు తిరుగుతోంది. టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. టీడీపీ నేత వర్మతో జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లోనూ వర్మకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే విషయంలో వర్మ అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల అధినాయకత్వం కలిసే ఉన్నా కూడా పిఠాపురంలో మాత్రం వేర్వేరుగా కనిపిస్తున్నారు. దీంతో వర్మ మద్దతు దారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వర్మ ఇప్పుడు తీసుకొనే నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం మూడు నెలల్లోనే పిఠాపురంలో సీన్ మారిపోయింది. పవన్ గెలుపు కోసం సీటు త్యాగం చేసి మరీ భారీ మెజార్టీకి కారణమైన టీడీపీ నేత వర్మకు ప్రాధాన్యత దక్కటం లేదు. స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో వర్మకు దాదాపు మాటలు కట్ అయినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పని చేసుకోవాలని అధినాయకత్వం సూచించినా సరే తమకు గుర్తింపు దక్కటం లేదని టీడీపీ కేడర్ వాపోతోంది. వర్మను దూరం పెట్టటాన్ని ఆయన మద్దతు దారుల ఆగ్రహానికి కారణమవుతోంది.
పిఠాపురంలో పవన్ పర్యటించిన ప్రతీ సమయంలోనూ వర్మ హాజరవుతున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వటం లేదనే అభిప్రాయం ఉంది. స్థానికంగా జనసేన నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందటం లేదు. వర్మ మాజీ ఎమ్మెల్యే కావటంతో స్థానికంగా ఉన్న పరిచయాలు మరియు అధికారుల్లో ఉన్న గుర్తింపుతో నియోజకవర్గ అంశాల పైన చర్చిస్తున్నారు. అది జనసేన మద్దతు దారులకు నచ్చటం లేదు. వర్మ ఏం కావాలో ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
పవన్ పూర్తిగా డిప్యూటీ సీఎంగా తన విధులకు పరిమితం అయ్యారు. దీంతో వర్మ నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషించటం జనసేన స్థానిక నేతలకు రుచించటం లేదు. రెండు పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి తో అధికారులు ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పవన్ పోటీ ఖరారు అయిన సమయం లో అధికారంలోకి వస్తే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా అది ఇంకా అమలు కాలేదు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వర్మ సైతం అసహనంతో ఉన్నట్లు సమాచారం. దీంతో వర్మ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. వర్మ గనుక ఏదైనా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అది చంద్రబాబు మరియు పవన్ కి పెద్ద చావు దెబ్బ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండబోదు