YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. మరోవైపు అలాంటి అపచారం ఏదీ జరగలేదని వైసీపీ ఆ విమర్శలను ఎదుర్కొంటోంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ ప్రభుత్వం వ్యాఖ్యలు చేసిందని, ఇదంతా రాజకీయ లబ్ది కోసమేనని మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఈ విషయంలో ప్రధాని చొరవ తీసుకుని నిజమేంటో తేల్చాలని కేంద్రాన్ని వైసీపీ విజ్ఞప్తి చేసింది.
గత కొన్ని రోజులుగా కల్తీ నెయ్యి ఆరోపణలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని, ప్రగతిని చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు.. ఇప్పుడు లడ్డూ ప్రసాదాన్ని వంకగా పెట్టుకుని వైసీపీపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దశాబ్దాలుగా సాగుతున్న లడ్డూ ప్రసాదం తయారీ గురించి ఆ లేఖలో జగన్ వివరించారు. ప్రసాదం తయారీలో వాడే నెయ్యి ఎక్కడ నుంచి సేకరిస్తారు.. ఎలా టెస్ట్ చేస్తారు?.. అది ఎలా తిరుమల వరకు చేరుతుంది.. లాంటి పూర్తి వివరాలకు లేఖలో స్పష్టం చేశారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. అది టీడీపీ ప్రభుత్వం అయినా లేక వైసీపీ అయినా ఇదే తీరుగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ కల్తీ నెయ్యి అనేది ఉంటే దానిని ఆలయం లోపలికి రానీయరని, మూడు విడతల టెస్టింగులోనే అది తేలుతుందని కూడా తెలిపారు. ఇది మర్చిపోయి టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల వాతావరణాన్ని రాజకీయ దురుద్దేశంతో అవమానపాలు చేస్తున్నారని జగన్ అభివర్ణించారు. ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఎలా వ్యవహరించాలో కూడా టీడీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని, ఇది ఎంతో మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అని కోరారు. అయితే.. దీనిపై కేంద్రం స్పందించి ఎలాంటి చర్యలు చేపట్టబోతుందని ప్రస్తుతం ఆసక్తిగా మారింది. జగన్ రాసిన లేఖని బట్టి ప్రధాని చొరవ తీసుకుని సీబీఐ విచారణకు ఆదేశిస్తారని అంతా భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ కూటమిగా ఏర్పడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జగన్ రాసిన లేఖను ప్రధాని మోదీ ఏ విధంగా చూస్తారనే అంశంపై సందిగ్దత నెలకొంది.