PM MODI: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం అంతకంతకూ ముదురుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు పంది కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం (సెప్టెంబర్ 18) ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది. దేశవ్యాప్తంగా ఈ అంశం చాలా దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు, ప్రజలు, హిందూ సంఘాలన్నీ ఈ చర్యని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివ స్వామి మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ పవిత్రతకు భంగం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల పాటు ఈ లడ్డూని పీఠాధిపతులందరూ తిని ఘోరమైన అపచారం చేశామని విచారం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతిలో గోవులను పెంచి వాటి నుంచి వచ్చే పాల ద్వారా నెయ్యిని తయారు చేసి దానిని లడ్డూ తయారీలో వాడాలని పీఠాధిపతులం విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. లడ్డూ వ్యవహారంలో పాత్రధారులైన వారందరినీ ఖచ్చితంగా శిక్షించాలని వారు కోరారు .
తిరుమల లడ్డు వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు ఉండనున్నారు. వీరితో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉండనున్నారని ప్రభుత్వం వివరించింది. తిరుమల సంప్రోక్షణకు టీటీడీ సోమవారం శాంతి హోమం నిర్వహించింది. ఆనంద నిలయంతో పాటు మాడ వీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ చేశారు.తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది.
మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ జగన్ ఆ లేఖలో రాశారు. లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. నిజాలు నిగ్గు తేల్చాలని జగన్ అన్నారు. చంద్రబాబు దుష్ప్రచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారనీ, సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారనీ, టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారని ఆ లేఖలో పేర్కొన్నారు. రిపోర్టుకి పంపించిన నెయ్యిని లడ్డూల తయారీకి వినియోగించలేదని ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామల రావు స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబు నాయుడుపై ఎన్నడు లేనంతగా సీరియస్ అయ్యారట ప్రధాని మోడీ. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి తమని కూడా ఇరకాటంలో పడేశారని ఆయన చాలా కోపంగా ఉన్నట్లు సమాచారం. ఏదైతే ఏం కూటమికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.