Sunday, October 13, 2024

Revanth Reddy: సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు రగడ.. రేవంత్ పై మంత్రుల గుస్సా.

- Advertisement -

Revanth Reddy: సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలు తీసుకొంటున్నారని మంత్రులు సైతం ఆగ్రహంతో ఉన్నారా? లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నారని భావిస్తున్నారా? హైడ్రా వ్యవస్థతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఖాయమని అంచనా వేస్తున్నారా? సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు వ్యతిరేకత తెస్తుందని భయపడుతున్నారా? సీఎం చెప్పినా వినడం లేదని కార్యక్రమానికి ముఖం చాటేశారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే ప్రధాన చర్చ. కాంగ్రెస్ పార్టీలో సైతం అంతర్గతంగా ఇదే టాక్ నడుస్తోంది. దీంతో తమకు ఇబ్బందులు తప్పవని కొందరు మంత్రులు భయపడుతున్నట్టు సమాచారం.

తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 16న రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా ఇంకెవరు హాజరుకాలేదు. వాస్తవానికి సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై తొలి నుంచి రాజకీయ వివాదం నడుస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. ఐతే అనివార్య కారణాల వల్ల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరగలేదు. ఇంతలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అనుకున్నదే తడవుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం కూడా జరిగిపోయాయి.

ఈ పరిణామం అనేక వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని కొందరు మంత్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు.. సెంటిమెంట్ తో కూడకున్న వ్యవహారం కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇదే అంశాన్ని నెత్తికెత్తుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది తమకు ఎక్కడ ఇబ్బందికరంగా మారుతుందోననే ఆందోళన లో కొందరు మంత్రులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది.గతంలో కేటాయించిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, అదే ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని క్యాబినెట్ లోనే కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అది కాదంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడలిలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు మంత్రులు చెప్పారట. ఐతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రతిపాదనలను పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పదేపదే కేటీఆర్ చెప్తుండటాన్ని పలువురు మంత్రులు ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులో అదే గనుక జరిగితే రాజీవ్ గాంధీని స్వయంగా తామే అవమానించినట్లు అవుతుందని అమాత్యులు వాపోతున్నారట. ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహూల్ గాంధీతో ఏఐసీసీ నేతలు ఎవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారమంతా పార్టీ క్యాడర్ లోను, ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు తీసుకెళ్తోందని నేతలు చెబుతున్నారు.పైగా రాజీవ్ గాంధీ విగ్రహ రూపురేఖలపైనా విమర్శలు మొదలయ్యాయి. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహం ఆయన పోలికలతో లేదంటూ కొందరు సోషల్ మీడియాలో వాపోతున్నారు. మొత్తానికైతే రేవంత్ రాజీవ్ విగ్రహ ఏర్పాటులో అత్యుత్సాహం ప్రదర్శించినట్టు విమర్శలు ఉన్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!