Janasena:బంపర్ మెజార్టీతో విజయం సాధించిన కూటమి నేతలకు ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. కూటమి నేతలు వరుస వివాదాల్లో చిక్కుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే తనని అత్యాచారం చేశాడని జిల్లా మహిళ అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు జనసేన వంతు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ , జనసేన కీలక నేత జానీ వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్ పై తాజాగా కేసు నమోదయ్యింది.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధిపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్టర్ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాలకు వెళ్ళినప్పుడు తనపై పలు మార్లు అత్యాచారం చేసాడని ఆ మహిళ పేర్కొంది.
హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు.
దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) ఎన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, జానీ మాస్టర్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయి. 2015లో ఓ కళాశాలలో మహిళపై దాడి చేసిన కేసులో జానీ మాస్టర్‌కు 2019లో మేడ్చల్ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తాజాగా మరో మహిళ ఆయనపై కేసు నమోదు చేసింది. గత ఎన్నికల్లో జనసేన తరుఫున జానీ మాస్టర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరి జానీ మాస్టర్ లైంగిక వేధింపులపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.