Friday, October 4, 2024

Telangana politics: తెరపైకి ప్రాంతీయ వాదం.. తెలంగాణలో పెను వివాదం

- Advertisement -

Telangana politics: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లవుతోంది. ఇప్పుడిప్పుడే విభజన అంశాన్ని మరిచి తెలుగు రాష్ట్రాల మధ్య సయోధ్య నెలకుంటోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ రాజకీయాల్లో ప్రాంతీయ అంశం పెను వివాదంగా మారే అవకాశముంది. దీంతో ఇది ఎటువైపు దారితీస్తుందోనన్న చర్చ బలంగా నడుస్తోంది. తెలంగాణ శాసనసభ ఇటీవల పీఏసీ ఛైర్మన్ బాధ్యతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి అప్పగించటం ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా అయితే పీఏసీ ఛైర్మన్ పదవి ప్రతిపక్ష నేతలకు ఇస్తుండగా.. ఈసారి మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఇవ్వటం వివాదానికి తెరతీసింది. దీంతో.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు.. అధికార పక్షంపై మరోసారి ఘాటు విమర్శలు చేయటం మొదలుపెట్టారు.

కాంగ్రెస్ కండువా కప్పుడున్న గాంధీకి ఎలా పీఏసీ బాధ్యలు అప్పజెప్పారని ప్రశ్నించారు. కాగా.. తాను ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని, రేవంత్ రెడ్డి తనకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని.. దేవాలయాల్లో కప్పే కండువానే అని.. తనపై విమర్శలు చేసే సీనియర్ నేతలకు అది కనిపించపోయి ఉండొచ్చంటూ కొంచెం వెటకారంగానే.. అరికెపూడి గాంధీ డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే.. తాను ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పుతానని.. ఆయన ఇంటిపై పార్టీ జెండా ఎగరేస్తానంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

పాడి కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించిన అరికెపూడి గాంధీ.. 11 గంటలకు తన ఇంటికి రావాలని.. రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానంటూ ప్రతిసవాల్ విసిరారు. నువ్వో నేనో చూసుకుందామంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అయితే.. అప్పటికే పోలీసులు.. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటంతో.. కౌశిక్ రెడ్డి వెళ్లలేకపోయాడు. కానీ.. అక్కడే ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ రెడ్డి.. తాను అచ్చమైన తెలంగాణ పౌరున్నని.. ఎక్కడి నుంచో బతుకొచ్చిన వాళ్లు బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.దీంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. దీంతో మరోసారి ప్రాంతీయ తత్వం తెరపైకి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చారు. పోలీసులు గాంధీని అడ్డుకోగా.. ఆయన అక్కడే బైఠాయించారు. ఇక.. ఎంతగా అడ్డుకున్నప్పటికీ కొందరు అనుచరులు మాత్రం గేట్లు తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు. అంతేకాకుండా.. గుడ్లు, టమాటాలు, రాళ్లతో కౌశిక్ నివాసంపై దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. ఈ దాడి సమయంలో.. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడంటూ అరికెపూడి గాందీ.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన పదజాలంతో కౌశిక్ రెడ్డిని దూషించారు. గాంధీకి మద్దతుగా దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్ లాంటి జంపింగ్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ.. కౌశిక్ రెడ్డిపై మాటల దాడికి దిగారు.

అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తన విమర్శల్లో డోసు పెంచారు. దాడికి ప్రతిదాడి ఉంటుందని హెచ్చరించారు. బతకటానికి వచ్చిన ఆంధ్రా వ్యక్తివి.. మళ్లీ ఆంధ్రాకు పారిపోయే విధంగా ప్రతిదాడి చేస్తానంటూ హెచ్చరించారు. తనను శేరిలింగంపల్లి నుంచి వెళ్లిపోవాలి చెప్పటానికి ఇది గాంధీ అయ్యా జాగీరేం కాదని.. తన అయ్య జాగీరని, తానూ తెలంగాణ బిడ్డనని, ఆంధ్రా వ్యక్తి, కృష్ణా జిల్లాను విడిచిపెట్టి బతకడానికి వచ్చింది గాంధీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో.. మరోసారి తెలంగాణ, ఆంధ్రా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. దీంతో.. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ విభేదాలు తలెత్తే ప్రమాదముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!