YS Jagan: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనల్లో భద్రతా వైఫల్యం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్య ధోరణిని నిరూపించుకుంది. ఇటీవల వైఎస్ జగన్ గుంటూరు, కాకినాడ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ పర్యటనల్లో అడుగడుగునా భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన ఒక మహానేత పట్ల ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ విధంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగిన స్థాయిలో భద్రత ఏర్పాట్లు చేయలేదని, కేవలం ఒక్కో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, అరకొరగా కానిస్టేబుళ్లను వినియోగించి కూటమి తన మందబుద్ధి చూపించుకుందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినా అధికారులు బాధ్యతాయుతంగా స్పందించడం లేదని వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.
మొన్నటికి మొన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని జైలులో పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సమయంలో కూడా సాధారణ భద్రత మాత్రమే కల్పించారు. జన హృదయ నేతను దగ్గర నుంచి చూడాలని పెద్దఎత్తున వచ్చిన ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు విఫల యత్నం చేశారు. ఎక్కడ చూసినా పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపించింది. పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద కూడా కనీస భద్రత లేకపోవడంతో ఒకేసారి పెద్ద సమూహం జగన్‌ను చుట్టుముట్టింది. ఎవరు పార్టీ కార్యకర్తలో, ఎవరు విద్రోహ శక్తులో కూడా గుర్తించలని పరిస్థితి నెలకొనడం మరింత ఆందోళనకరంగా మారింది. మరి మాజీ ముఖ్యమంత్రికే భద్రత ఇలా అరకొరగా ఉండడం చూస్తే.. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తుందన్నది స్పష్టం అవుతోంది.