YSRCP -TDP: తిరుమల లడ్డూ వివాదం ముదురుతున్న క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు జగన్ తిరుమల పర్యటనకు రానున్నారు. రేపు అంటే 28వ తేదీన జగన్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగన్ తిరుమలకు డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకోవాలని టీడీపీ కూటమి అడ్డు పడుతోంది. లేదంటే జగన్‌ను అడ్డుకుంటామని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో దీనిపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతూ టీడీపీ ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తిచూపుతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ తిరుమల దర్శనానికి వచ్చారు. అప్పుడు జగన్ రావడం కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రధాని వేచి ఉండి మరీ జగన్‌తో కలిసే స్వామివారి దర్శనానికి వెళ్లారు. మరి అప్పుడు ఈ టీడీపీ కానీ, బీజేపీ కానీ డిక్లరేషన్ గురించి ఎలాంటి మాట మాట్లాడలేదు. ఎందుకంటే, ప్రధాని హోదాలో ఉన్న ఒక వ్యక్తితో కలిసి జగన్ దర్శనానికి వెళ్లారు కాబట్టి.
అయితే.. గతంలో టీటీడీ పాలకమండలిలో సభ్యురాలిగా వంగలపూడి అనితను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆమె బ్యాగులో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని, బైబిల్ లేకుండా కాలు కూడా బయటపెట్టను అని చెప్పిన ఆమెను ఎలా టీటీడీలో అధికారిణిగా నియమించారని, ఆమె ఎలాంటి డిక్లరేషన్ మీద సంతకం పెట్టిందని వైసీపీ నిలదీస్తోంది. ప్రస్తుత ఆమె ఏపీ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని ఈ డిక్లరేషన్ గొడవను ప్రస్తుతం మాత్రం వైసీపీ అధినేతను టార్గెట్ చేసి ఎందుకు సమస్య లేవనెత్తుతున్నారని వైఎస్సార్సీపీ చెబుతోంది. అన్యమతస్తులుగా ఉన్న ఎంతో మంది ప్రముఖ నేతలు, ప్రజలు సైతం నిత్యం శ్రీవారి దర్శించుకున్నప్పుడు లేని సమస్య జగన్ విషయంలో మాత్రం ఎందుకు వచ్చిందని అడుగుతోంది. గతంలో జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు కూడా సంప్రదాయ దుస్తుల్లో మూడు నామాలు పెట్టుకునే దర్శించుకున్నారని, హిందుత్వాన్ని గౌరవించే అలాంటి నేతపై ఈ దుష్ప్రచారం ఏంటని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది.