TDP-JANASENA: అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అనుకూల పరిస్థితులను సృష్టించుకోవడంతో పాటు ఎవరేం చేస్తారులే అన్న విధంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరం పరాసుపేట కేంద్రంలో జనసేనకు చెందిన ఓ వర్గం నాయకులు వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బ్యానరు కట్టారు. ఆ బ్యానర్‌లో అదే పార్టీకి చెందిన యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఫోటోలు లేవని, ఫోటోలు వేయకుండా చందాలు మాత్రం ఎలా తీసుకుంటారని నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాగ్వాదం మొదలైంది. అనంతరం నాని క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
ఆ గొడవనే మనసులో పెట్టుకున్న నాని మద్యం సేవించి వచ్చి ఆ బ్యానర్‌ను పూర్తిగా చించేశాడు. ఈ పరిణామానానికి ఆగ్రహం వ్యక్తం చేసిన జన సైనికులు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు ఇళ్లపై దాడి చేశారు. ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసి వారిద్దరినీ రక్తాలు కారేలా తీవ్రంగా కొట్టారు. ఈ గొడవ ఇంతటితో మానుకోదని భావించిన జనసేన నాయకులు.. నాని తమపై ఎదురుదాడి చేస్తారన్న భయంతో టీడీపీ నాయకుడు శంకు శ్రీను, మరికొందరిని తీసుకొని నాని, శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లారు. వారిద్దరినీ కాళ్లతో తంతూ చితకబాదారు. జనసేన నాయకుడు నాని టీడీపీ నాయకుడు శంకు శ్రీనును కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పేంత వరకు వదల్లేదు. రెండు వర్గాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నాయకులు ఏ రీతిలో దౌర్జన్యాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికార పార్టీ నాయకులే ఇలా వ్యవహరిస్తే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.