Telangana Politics: భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెబుతారు. అక్కడంతా సిస్టమేటిక్ విధానం ఉంటుందని చెప్పుకొస్తారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడేందుకు కుదరదు అంటార. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అక్కడ బీజేపీలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేతలు రెండు వర్గాలుగా మారి విభేదించుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాతే తెలంగాణలో ఆ పార్టీ బలోపేతమవుతూ వచ్చింది. 2019లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీలు గెలవడంతో కమలం పార్టీలో చేరికలు ఎక్కువయ్యాయి. కానీ ఎందుకో క్రమేపీ ఆ పార్టీ బలం తగ్గుముఖం పడుతూ వస్తోంది.
ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి మంచి ఊపు వచ్చింది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా పార్టీలో చేరికలు మరింతగా పెరిగాయని చెబుతారు. ఇలా పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చాక గతం ఒక తీపి జ్ఞాపకంగానే మిగిలిపోతుందనే టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో ప్రారంభమైన విభేదాలు ఇప్పటికీ సమసిపోలేదని తాజా ఉదంతాలు రుజువు చేస్తున్నాయి.ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతల్లో కొందరు తమకు సరైన గౌరవం దక్కడం లేదని నిత్యం అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి తగిన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం అంతా ఆ నలుగురే అన్నట్టు పరిస్థితి ఉంది. ఆ పెద్ద నేతలకే అంతో కొంత విలువ లభిస్తోంది. ఇటీవల వరద ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు రెండు బృందాలను నియమించారు. ఇందులో ఒక బృందం కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మంలో పర్యటించగా, మరొకటి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాబాద్ వెళ్లింది. అయితే ఈటెల బృందంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని సభ్యుడిగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారట. ఒక బృందాన్ని నియమిస్తే బీజేపీ ఎల్పీ నేతగా తాను నేతృత్వం వహించాలని లేదంటే తనను పూర్తిగా మినహాయించాలి కానీ సాధారణ బృంద సభ్యుడిగా ఎలా నియమిస్తారని పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహేశ్వర్‌రెడ్డి. తనను చిన్నచూపు చూస్తున్నారని భావించిన బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరద ప్రాంతాల పర్యటనకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.
తాజాగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఓ ప్రైవేటు హోటల్ లో అట్టహాసంగా చేపట్టారు కమలనాథులు. ఈ కార్యక్రమానికి కనీసం బీజేఎల్పీ నేతను ఆహ్వానించలేదన్న వార్త గుప్పు మంటోంది. మీడియాకు పంపించిన ఇన్విటేషన్ లో కేంద్ర మంత్రులు, ఎంపీల పేర్లు పెట్టినా బీజేఎల్పీ నేత పేరు పెట్టలేదట. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పిలిచి ఎల్పీ లీడర్‌ను ఆహ్వానించకపోవడమేంటని మహేశ్వర్‌రెడ్డి అనుచరులు నొచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఇదేనా బీజేపీ ఎల్పీ లీడర్‌కు ఇచ్చే మర్యాద? అంటూ మహేశ్వర్‌రెడ్డి కూడా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన పదవులు ఇచ్చినా సంతృప్తి చెందడం లేదని, త్యాగాలు చేసి వారికి పదవులు కట్టబెడితే వారిలో సంతృప్తి ఉంటుందని.. పార్టీ లైన్ తెలియని వారే ఇలాంటి వాదనలు తెరపైకి తెస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి ఆవేదనను కొట్టిపడేస్తున్నారు బీజేపీ సీనియర్ నేతలు. మొత్తానికి ఈ వ్యవహారం పరిశీలిస్తే బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం ఇప్పటికీ కుదరడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇది ఎంతవరకూ తీసుకెళుతుందో చూడాలి. బీజేపీ అభిమానులు మాత్రం ఈ పరిణామాను జీర్ణించుకోలేకపోతున్నారు.