Telangana: తెలంగాణ బీజేపీ సారధి ఎవరు? అధ్యక్ష పదవి ఎవరికి లభిస్తుంది? బీసీ నేతకు ఇస్తారా? లేకుంటే ఇతర వర్గాలకు కేటాయిస్తారా? ఏ బాధ లేకుండా మరోసారి బండి సంజాయ్ కు చాన్స్ ఇస్తారా? అయితే ఆయన కేంద్ర మంత్రి కావడంతో ఆ చాన్సే లేదంటున్నాయి కాషాయవర్గాలు. అలా అయితే ఎవరికి అని ఆసక్తికర చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు బీసీ వర్గ నేతకు కేటాయించడంతో బీజేపీపై ఒత్తిడి పెరిగింది. అందుకే కాషాయ పార్టీ మేథో మధనం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అధ్యక్షుడ్ని ఖరారు చేసి పార్టీని పూర్తిగా గాడిలో పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయిలో విస్తరించాలన్నదే బీజేపీ ప్లాన్ అన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బలం ఉన్న నేతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు అందరికీ పార్టీ సభ్యత్వ నమోదు పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ… వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన 70 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వంగా నమోదు చేయించాలని ఆశిస్తోందంటున్నారు. ఈ టార్గెట్‌ను చేరుకోడానికి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.
బీజేపీలో అధ్యక్ష పీఠంపై ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్‌తోపాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆశలు పెట్టుకున్నారు. ఈ నలుగురిలో ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఈటల రాజేందర్ చాలాకాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల… బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే గురిపెట్టారు. పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమే ఇచ్చింది. కానీ కాషాయ సిద్ధాంతాలను అనుసరించి ఇప్పటివరకు ఈటలకు అధ్యక్ష పదవిపై ఇవ్వకుండా నెట్టుకొచ్చింది. ఇక ఆయన పోటీగా మరో ఇద్దరు ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తుండటంతో పార్టీ ఈ నలుగురికి పరీక్ష పెట్టిందంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 70 లక్షల సభ్యత్వాలు చేరుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. ప్రతి బూత్‌లో కనీసం 200 మంది కార్యకర్తలను సంపాదించాలని భావిస్తోంది ఆ పార్టీ. దీంతో పార్టీ అగ్ర నేతలంతా రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును ఓ యజ్ఞంలా చేస్తున్నారంటున్నారు. ఎంపీ ఈటలతోపాటు రఘునందన్‌రావు, అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ఎవరికివారుగా సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నారని చెబుతున్నారు. తమ నియోజకవర్గాలతోపాటు తమ అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వం చేయించి… పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఆ పార్టీ ఆనవాయితీ. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. ఇప్పుడు కూడా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించి జాతీయ పార్టీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.ఈ నెల 9న ప్రారంభమైన సభ్యత్వ నమోదు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. హైకమాండ్ ప్రత్యేక టార్గెట్లు పెట్టడంతో ఎవరు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాబోయే బీజేపీ అధ్యక్షుడికి ముందుగానే కఠిన పరీక్ష పెట్టిందంటున్నారు. చూడాలి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో?