Jagan :గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేషన్ సరుకులను ప్రతి ఇంటికి తరలించేందుకు భారీ ఎత్తున ఎండీయూ వాహనాలు కొనుగోలు చేశారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏకంగా 539 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ పెద్దఎత్తున వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో ఈ వాహనాల వినియోగం ద్వారా ప్రజా అవసరాలకు లబ్ది చేకూర్చేలా జగన్ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలలుగా అవి మూలన పడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వాహనాలపై వినియోగంపై శ్రద్ధ కనబరచలేదు. అయితే.. ఇటీవల ఆ వాహనాలకు మోక్షం వచ్చింది. విజయవాడ వరద విపత్తు సమయంలో కూటమి ప్రభుత్వం సహాయ చర్యలకు గాను పెద్దఎత్తున ఆ వాహనాలను వినియోగించుకుంది. ఈ వాహనాలు వరద బాధితులకు నిత్యావసరాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించాయి. కాగా, కొన్ని నెలలుగా మూలకు చేరిన ఈ వాహనాలను సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగించుకోవడం మరో ఎత్తు.
అయితే.. ఈ విషయంలో ప్రతి ఒక్కరి చూపు వైసీపీ ప్రభుత్వంపై పడుతోంది. అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే కానీ, అసలు ఆలోచన జగన్‌దే అని రాష్ట్రమంతా శభాష్ అంటోంది. తమ అధినేత జగన్ ఆలోచనను కూటమి పెద్దలు కాపీ చేశారంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ వాహనాలను కొనుగోలు చేసినా.. ఇప్పుడు ఇంతటి దారుణ పరిస్థితుల్లో వాడుకోవడం మంచిదే అని, ఏది ఏమైనా తమకు ప్రజా సంక్షేమమే ముఖ్యమని వైసీపీ చెబుతోంది. ఇప్పటికైనా జగన్ ముందస్తు చూపును ఈ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని.. వీలైతే ఆచరణలోకి తీసుకోవాలని అంటోంది. ఏది ఏమైనా ఒక ప్రభుత్వం చేసిన ఆలోచనను మరో ప్రభుత్వం ఈ విధంగా వాడుకోవడం శుభ పరిణామమే.