YSRCP: వినాయక చవితి సంబరాలు ముగిశాయి. ఊరువాడా చిన్నాపెద్దా అంతా కలిసి పండుగను ఘనంగా చేసుకుని, 11 రోజులు ఆ వినాయకుడిని భక్తి ప్రపత్తులతో పూజించి నిమజ్జనం పూర్తి చేశారు. అయితే.. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. ఇప్పటికే ప్రజల గుండెల్లో చెరగలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న వైఎస్సార్సీపీ.. ఇప్పుడు అది దేవుడి విషయంలోనూ నిరూపితమైంది. దేశమంతా ఘనంగా వినాయక నిమజ్జనం పూర్తి చేస్తే.. ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే నిమజ్జనం చేస్తామని గొప్ప శపథం చేశారు. మరి ఆ ఊరు ఎక్కడో, దానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం.
రాష్ట్రంలో కీలక ప్రాంతంగా పేరున్న పల్నాడు జిల్లా అచ్చంపేట మండల పరిధిలో ఉన్న గ్రంథసిరి గ్రామంలో అందరిలాగే వైసీపీ కార్యకర్తలు, నాయకులు చందాలు పోగేసుకుని గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పది రోజులుగా పెద్దఎత్తున పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నారు. ఇక నిర్విఘ్నంగా గణపతిని పూజించిన వైసీపీ నాయకులు.. తర్వాతి కార్యక్రమంగా నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టరుపై ఉంచి ఊరేగింపుగా బయలుదేరిన వారికి అనుకోని సంఘటన ఎదురైంది. నిమజ్జనం నిమిత్తం సమీపంలోని కృష్ణా నదికి వెళ్లాల్సిన వారు మధ్యలో టీడీపీ ప్రాబల్యం ఉన్న ఓ ప్రాంతం మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. అయితే.. వైసీపీ తరపున ఏర్పాటు చేసిన ఈ వినాయకుడి ఊరేగింపును తమ ప్రాంతం మీదుగా తీసుకువెళ్లడానికి వీల్లేదని స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఊరేగింపుకు పోలీసుల అనుమతి కూడా లేదని, వేరే మార్గంలో 20 కిలోమీటర్లు తిప్పుకుని వెళ్లి నిమజ్జనం చేసుకోవాలని టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తీవ్రమై ఇరువర్గాల మధ్య గొడవలు జరగడంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక తమ వినాయక విగ్రహాన్ని తిరిగి మండపంలోకి తెచ్చి పెట్టుకున్నారు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో అధికార పార్టీ పెత్తనాలు మితిమీరుతున్నాయని, శాంతి భద్రతలు అసలు కానరావడం లేదని పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. మళ్లీ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాకే తమ వినాయకుడికి నిమజ్జనం చేస్తామని, అంతవరకు రోజూ పూజించుకుంటామని వైసీపీ నేతలు శపథం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.