BJP- CONGRESS: రెండిటికీ చెడ్డ రేవడిగా మారింది తెలంగాణ ప్రజల దుస్థితి. అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో తెలంగాణ ప్రజల బాధలు వర్ణనాతీతం. తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చి సుమారుగా నెల రోజులు అవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలను వరదలు, భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలా వరకు ఆస్తులు కోల్పోయారు. చివరకు ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దాదాపు వారం రోజుల పాటు వారిని వరదలు బెడద వీడలేదు. వరదలు తగ్గాక ఇళ్లకు వచ్చి చూస్తే బురదతో నిండిపోయి ఉన్నాయి. కేవలం కట్టుబట్టలు తప్పితే ఏమీ మిగల్లేదు. ఇంట్లోని వస్తువులన్నీ పాడయ్యాయి.వరదలు తీసుకొచ్చిన నష్టం అంతాఇంతా కాదు. వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు కూడా అక్కడ పర్యటించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి పది వేల చొప్పున అందిస్తామని చెప్పారు. తాత్కాలికంగా ఉపశమనం కోసం నిత్యావసరాలు అందించారు.
కేంద్రం నుంచి కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తోపాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వరద నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు.వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు సైతం రాష్ట్రానికి వచ్చాయి. ప్రధానంగా ఎక్కడెక్కడ అయితే వరదల వల్ల నష్టం ఏర్పడిందో అక్కడ వారు పర్యటించారు. నష్టం అంచనాలను లెక్కలు వేశారు. ఆ తదుపరి సచివాలయంలో ముందుగా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రివ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుమారు 5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తాత్కాలికంగా అంచనా వేశామని రేవంత్ ఆ సమయంలో వారి దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన నష్టానికి అనుగుణంగా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తదుపరి కేంద్రం బృందంతో నిర్వహించిన రివ్యూలోనూ అదే విషయాన్ని వివరించారు. కేంద్ర బృందం వచ్చి సర్వే నిర్వహించిన కూడా రెండు వారాలు దాటింది. కానీ ఇంతవరకు కేంద్రం సాయం విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.
వరద విషయంలో అసలు రాష్ట్రానికి ఎంత సాయం అందిస్తున్నారన్న అంశంపైనా క్లారిటీ లేకుండాపోయింది. ఇటు రాష్ట్ర పెద్దలు, అటు వరద బాధితులు కేంద్రం ఇచ్చే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రస్తుతం దేశంలో జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కేంద్రం పెద్దలంతా కూడా ఆ ఎన్నికల బిజీలో ఉండిపోయారు. వరద బాధితులకు సాయం అందాలంటే ముందుగా హైరిస్క్ టీమ్ భేటీ కావాల్సి ఉంటుంది. ఆ తదుపరి కేంద్ర కేబినెట్ భేటీ అయి సాయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు బీజేపీ నేతలంతా ఎన్నికల బిజీలో పడడంతో అది కాస్త వరద బాధితుల పాలిట శాపంలా తయారైంది. కేంద్ర హైరిస్క్ కమిటీ ఇంకా కేంద్ర బృందం ఇచ్చిన సర్వే రిపోర్టు పైనే కసరత్తు చేస్తున్నట్లుగానూ టాక్ నడుస్తోంది. ఈ స్టడీ ఎప్పటివరకు ముగుస్తుంది..? ఆ ఎన్నికలు ఎప్పుడు అయిపోతాయి..? తమకు ఎప్పుడు సాయం అందుతుందా..? అని బాధితులు మాత్రం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హడావుడి నడిచింది. కానీ వరద బాధితులకు మాత్రం ఇంతవరకు చిల్లిగవ్వ అందించలేదు. పొరుగున ఉన్న ఏపీలో మాత్రం కదలిక ప్రారంభమైంది. సాయంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కానీ రేవంత్ సర్కారు మాత్రం మొద్దు నిద్రతో గడుపుతోంది. అటు కేంద్రం సైతం తమ పనికాదన్నట్టు వ్యవహరిస్తోంది. అందుకే తెలంగాణ ప్రజలు రెండింటికీ చెడ్డ రేవడిగా మారిపోయారు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కేంద్రం విపత్తుల సాయానికి ముందుకు రాకపోయినా ఎంతో సాహసంతో సాయం ప్రకటించే వారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు