Friday, October 4, 2024

D.Nagendhar: దానం నాగేందర్ పై వేలాడుతున్న అనర్హత వేటు కత్తి.. ఉప ఎన్నిక తప్పదా?

- Advertisement -

D.Nagendhar: తెలంగాణాలో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అంటూ చర్చ నడుస్తోంది. పొలిటికల్ సర్కిల్ లో వార్త సర్క్యూలేట్ అవుతోంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేటు వేలాడుతున్న నేపథ్యంలో ఈ వార్త బయటకు రావడం విశేషం. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించగా.. అందులో ఒకేఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అనర్హత వేటు నుంచి తప్పించుకునే వీలు లేదని ప్రచారం జరుగుతోంది. ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడంతో దానం నాగేందర్ ఆలోచన కూడా మారింది. వెంటనే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో చేరిన దానం నాగేందర్ తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఏ పార్టీ నుంచి గెలిచారో అదే పార్టీపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ లో చేరి సాటి బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. అందుకే బీఆర్ఎస్ దానం నాగేందర్ ను టార్గెట్ చేసుకుంది.

ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగితా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్ కు మాత్రం చిక్కులు తప్పకపోచ్చనేది రాజకీయ పరిశీలకుల భావన.

తెలంగాణలో ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వారికి రానీ సమస్య ఇప్పుడు దానం విషయంలో ఏర్పడింది. ఇప్పుడు ఇదే దానంకు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

ఇటీవల ప్రభుత్వం నియమించిన పీఏసీ ఛైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తుంది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం చెబుతుంది.అంటే మిగితా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడుతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా..కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేది సందేహం. ఎందు కంటే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినందున దానంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది.

ఈ కారణంగానే ఉప ఎన్నికకు సిద్దంగా ఉండాల్సిందిగా దానం నాగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెబుతుంది. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదు అన్న భావనలో కాంగ్రెస్ ఉంది. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉందని తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే దానం నాగేందర్ ఇప్పుడు అందరికీ టార్గెట్ అయ్యారన్న మాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!