TDP: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టే ప్రతి పనిలో ప్రజల కన్నీటికి కారణం అవుతూనే ఉంది. తాజాగా మరో సంఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలను సీఎం చంద్రబాబు దూరం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించే చర్యకు చంద్రబాబు పూనుకుంటున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు లభించకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో కోటి ఆశలతో వైద్య విద్య చదవాలని అనుకునే విద్యార్థులకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల నిరాశ ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో జగన్ హయాంలోనే 5 కాలేజీలను ప్రారంభించి పూర్తి చేశారు. ఫలితంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఉన్నవాటిని కూడా ప్రైవేటుపరం చేస్తే మా పరిస్థితి ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా ఎన్‌ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ వద్దని ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఉందనేది వాస్తవం. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఇప్పటికే ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే రాష్ట్రంలోని విద్యార్థులకు మంచి అవకాశాలు కలగడంతో పాటు పేదలకు అత్యుత్తమైన వైద్య సేవలు అందుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్ పాట పాడుతుండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.