Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ గేమ్ పతాక స్థాయికి చేరుకుంది. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. కొత్త కండువాలు కప్పుకున్నారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు జైకొట్టారు. కానీ ఇప్పుడు పదవి కోల్పోయే ప్రమాదం ఎదురుకావడంతో కొత్త పల్లవి అందుకున్నారు. అబ్బబ్బే తాము పార్టీ మారలేదని..నియోజకవర్గ అభివ్రద్ధి కోసమే సీఎం రేవంత్ ను కలిశామని కొత్త భాష్యం చెబుతున్నారు. గులాబీ కండువా తీసేసి మూడు రంగుల కండువా కప్పుకున్నారు పది మంది. అయితే అది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు. దేవుడి కండువాగా భావిస్తున్నట్టు సరికొత్త రీతిలో చెబుతుండడం విశేషం.
తెలంగాణలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోగా.. అందులో ముగ్గురిపై కోర్టులో కేసు వేసింది బీఆర్‌ఎస్. ఆ ముగ్గురిపై చర్యలకు కోర్టు ఆదేశించడంతో ఇప్పుడు మిగిలిన ఏడుగురు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. మేము పార్టీ మారలేదని చెబుతుండటంతో పాటు తమ మెడలో వేసిన మూడు రంగుల కండువాలు దేవుడి కండువాలుగా ప్రచారం మొదలుపెట్టారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోడానికి తాము పార్టీ మారలేదని చెప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ కండువాకు పేరు మార్చి దేవుడి కండువాలుగా కలరింగ్ ఇవ్వడమే ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతుండడంతో తెగ భయపడుతున్నారు. ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందననే ఆలోచనతో అబ్బే… తాము పార్టీ మారలేదని… అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని చెబుతున్నారు. అంతేకాకుండా సాంకేతికంగా తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని… కాంగ్రెస్ కండువా అయితే దానిపై ఆ పార్టీ గుర్తు, పార్టీ అధ్యక్షుల ఫొటోలు ఉండాలి కదా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము సీఎంను కలిస్తే దేవుడి కండువా కప్పి సత్కరించారని ప్రచారం ప్రారంభించారు.
పార్టీ ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తే.. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే గాంధీ.ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో కాంగ్రెస్‌లో చేరినట్లు ఎమ్మెల్యే గాంధీ స్వయంగా ప్రకటించిన పోస్టుల సంగతేంటి? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇక గాంధీని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి చేసిన పోస్టును ట్రోల్ చేస్తున్నారు. ఒక్క గాంధీయే కాదు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు తప్ప మిగిలిన ఏడుగురు దేవుడి కండువాలన్న వాదనే ఎత్తుకున్నారు. పదవి కాపాడుకోవడానికి వారు దేవుడి పేరును చెబుతుండడం విశేషం.