Vijayasai Reddy: గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైఎస్సార్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఫలితాల అనంతరం పలువురు వైసీపీ ప్రముఖ నేతలు పార్టీని వీడి వలసబాట పట్టారు. ఇప్పటికే మోపిదేవి వెంకట రమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీని వీడతారని ప్రస్తుతం మరో ప్రముఖ నేత పేరు వినిపిస్తోంది. వైసీపీకి ఆది నుంచి మూలస్థంభంగా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీని వీడతారని ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. పార్టీలో వైఎస్ జగన్ తర్వాత అత్యున్నత స్థాయిలో పేరున్న విజయసాయి రెడ్డి పేరు ఇలా బయటికి రావడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో వైసీపీ చక్రం తిప్పడంలోనూ, ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడంలోనూ విజయసాయిరెడ్డిది ప్రత్యేక పాత్ర. ఇదే నిజమైతే అసలే కష్టకాలంలో ఉన్న వైసీపీకి ఇప్పుడు ఇది మరో ఎదురుదెబ్బలా మారనుందని శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
వైసీపీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయసాయి రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరతారని టీడీపీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నాక టీడీపీలో చేరతానని టూ విజయసాయిరెడ్డి తమను ప్రాధేయపడ్డారని కూడా అచ్చెన్నాయుడు చెప్పడం గమనార్హం. కాగా, విజయసాయిరెడ్డి రెండు సార్లు పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో పాటు వైసీపీ రాజ్యసభా పక్ష నేతగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయసాయిరెడ్డి ఓడిపోయారు. ఇదిలా ఉంటే, గతంలో కూడా విజయసాయిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారని వార్తలు హల్ చల్ చేశాయి. వైఎస్ జగన్‌తో విభేదాలు, ఒక దశలో ఆయనకి పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోవడం జరిగిందని పుకార్లు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇలా బాంబు పేల్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారో.. అసలు ఇందులో నిజానిజాలు ఏంటో తేలాలంటే కొద్ది కాలం వేచి ఉండాల్సిందే.