BJP:ఆయన రూట్ సెపరేటు.ఏదైనా కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడతారు. తన హితం హిందుత్వమని.. హిందూ భావజాలాన్ని బలంగా ప్రదర్శిస్తుంటారు. బహుశా ఆ కారణంగానే ఎక్కువగా కేసులు ఎదుర్కొన్నారు. ప్రజలు ఆయనను గుర్తిస్తున్నా…పార్టీ మాత్రం గుర్తించకపోవడంతో గుర్రుగా ఉన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నారు. పార్టీకి అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా.. తన రూట్లో తాను ముందుకు సాగుతున్నారు గోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గత కొద్దిరోజులుగా రాజాసింగ్ వ్యవహార శైలి వింతగా ఉంది. పార్టీలో అనుమానాలకు తావిస్తోంది. ఆయనది బీజేపీ భావజాలం అయినా.. పార్టీని వీడుతారో..ఏమో అన్నట్టు పరిస్థితి మారింది.
తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ది ప్రత్యేక పాత్ర. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా గత మూడుసార్లు రాజాసింగ్ దే గెలుపు. తెలుగు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సాధించిన బీజేపీ ఎమ్మెల్యే బహుశా ఈయనేనేమో. పాతబస్తీలో ఎంఐఎంకు దీటుగా బీజేపీ నిలవాలంటే రాజాసింగ్ లాంటి దూకుడైన నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. అందుకే బీజేపీ సైతం ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే గత ఏడాది ఎన్నికల అనంతరం పరిస్థితి పూర్తిగా మారింది. బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా మరోసారి శాసన సభా పక్ష నేత పదవిని ఆశించారు రాజాసింగ్. కానీ, పార్టీ పలు సమీకరణాలను ఆలోచించి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఎల్పీ లీడర్ చేసింది.అప్పటి నుంచి ఆయనలో అసంత్రుప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన తనకు బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో తన ప్రతాపం చూపారు రాజాసింగ్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయాలతో గుర్రుగా ఉన్న రాజాసింగ్ లోక్ సభ ఎన్నికల నాటికి తన వైఖరి ఏమిటో చెప్పకనే చెప్పారు. బీజేపీ హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా మాధవీ లతను నిలపగా.. ఆమెకు మద్దతుగా రాజాసింగ్ ప్రచారంలోకి రాలేదు. మరోవైపు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజాసింగ్ పై మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఇక పార్టీపరంగానూ రాజాసింగ్ అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. బీజేపీ శాసన సభ్యులందరూ అసెంబ్లీకి హాజరవుతున్నా.. ఆయన మాత్రం అసెంబ్లీలో కనిపించడం లేదు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నా రాజాసింగ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడినట్లు లేరు.
బీజేపీ అధికారిక కార్యక్రమాలకు సైతం ఇటీవల రాజాసింగ్ హాజరుకావడం మానేశారు. ఆఖరికి ఇటీవలి సెప్టెంబరు 17 సందర్భంగానూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన విమోచన దినోత్సవంలోనూ పాల్గొనలేదు. హైదరాబాద్ సంస్థానం ‘విమోచనం’ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరైన ఈ కార్యక్రమాన్ని బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. అయితే అదే హైదరాబాద్ కేంద్రంగా.. పాతబస్తీ ప్రాంతం కలిసి ఉన్న ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ మాత్రం కనిపించలేదు. ఇదే రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాత్రం ఆయన ప్రశంసించారు. గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను రేవంత్ ప్రభుత్వం అద్భుతంగా చేసిందని కొనియాడారు. కాగా ఇటీవల రాజాసింగ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీలో అత్యంత బలమైన నాయకుడైన బీఎల్ సంతోష్ పిలిపించుకుని మాట్లాడారు. అయినప్పటికీ ఆయన ఆగ్రహం చల్లారినట్లు లేదు. మరి త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో తరచూ పర్యటిస్తూ, కార్యక్రమాల్లో పాల్గొనే రాజాసింగ్ ను బీజేపీ అక్కడ ఉపయోగించుకుంటుందేమో చూడాలి.