Friday, October 4, 2024

Telangana: తెలంగాణ బీజేపీ గాడిలో పడుతుందా? కొత్త ఇన్ చార్జీగా అభయ్ పాటిల్

- Advertisement -

Telangana: తెలంగాణ బీజేపీకి అభయ్ పాటిల్ ఇంచార్టిగా వస్తారా? పార్టీని గాడిలో పెడతారా? కొంతమంది నేతల తీరును సరిచేస్తారా? సీరియస్ చర్యలకు ఉపక్రమించనున్నారా? విభేదాలను సరిచేస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అంటేనే విభేదాల పార్టీ అన్న ముద్ర రోజురోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో గాడిలో పెట్టే బాధ్యతను అభయ్ పాటిల్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్ల నుంచి రాష్ట్ర పార్టీకి కొత్త ఇంచార్జిగా అభయ్ పాటిల్ వస్తున్నారని ప్రచారం జరుగుతోందది. ట్విట్టర్ వేదికగా అభయ్ పాటిల్ కూడా తనని తాను తెలంగాణ ఇంచార్జిగా ప్రకటించుకున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఇంచార్జిలుగా తరుణ్ చుగ్, సునిల్ బన్సల్ కొనసాగారు. కానీ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం రాష్ట్ర నేతలపై గుర్రుగా వుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పాజిటివ్ ఫలితాలు సాధించినప్పటికి, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఘోరంగా విఫలమైంది.

2028 ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి రావాలన్నదే కాషయ దళం టాస్క్ గా పెట్టుకుంది. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయనే అంచనాలో బీజేపీ ఉంది. అందులో బాగంగానే అధిష్టానం రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బలం పెంచుకుంటే వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సులువవుతోందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ మళ్లీ ఇంకోసారి గెలవాలంటే దక్షిణాది రాష్ట్రాలు కీలకం కానున్నాయి. అందుకే ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ మార్క్ ఉండేలా అధిష్టాన పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారన్న టాక్ వినిపిస్తుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇంకా పెండింగ్ లో ఉంచారు. అధికార కాంగ్రెస్ అధికార బాధ్యతలను బీసీ నేతకు అప్పగించింది. ఈ తరుణంలో బీజేపీపై మరింత భారం పెరుగుతోంది. ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్లకే పగ్గాలు అప్పగించాలా? వలస నేతలకు ఛాన్స్ ఇస్తారా? అన్న పంచాయతీ ముదురుతోంది. అంతేకాదు రాష్ట్ర నాయకత్వానికి, బీజేపీఎల్పీకి మద్య గ్యాప్ పెరుగుతోంది. అధికార ప్రతినిధులు , జనరల్ సెక్రటరీల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోటీ చేసీ ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎక్కడున్నారు. గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. ఇట్లాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్న రాష్​ట్ర బీజేపీలో కొత్త ఇంచార్జ్ వస్తే నేతల తల రాతలు ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

ఇటువంటి పరిస్థితుల్లో కొత్త బీజేపీ రాష్ట్ర ఇన్చార్జిగా అభయ్ పాటిల్ కన్ఫర్మ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కానీ రాష్ట్ర నేతలు దాన్ని కొట్టి పడేస్తున్నారు. ఇన్నాళ్లు తరుణ్ చుగ్, సునిల్ బన్సల్‌ల నేతృత్వంలో రాష్ట్ర నేతల తీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు కొనసాగిందన్న విమర్శలున్నాయి. అంతేకాదు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారనే అపవాదు తరుణ్ చుగ్, సునిల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర నేతలపై ఉంది.అభయ్ పాటిల్ వస్తే ఆ పప్పులేవి ఉడకవంటున్నారు. తాజాగా సభ్యత్వ నామోదు కార్యక్రమానికి వచ్చిన అభయ్ పాటీల్ రాష్ట్ర నేతలకు గట్టిగానే చురకలు అంటించారు. పార్టీ కోసం పనిచేయకపోతే స్థానం ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు. ఆ క్రమంలో పాత నేతలకు అభయ్ పాటిల్ అంటే అస్సలు నచ్చడం లేదట.. అందుకే ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోకుండానే ఆయన మాకొద్దని డిల్లీ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!