AP floods: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇటీవల భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికీ వరద కష్టాల నుంచి కోలుకోని కుటుంబాలు ఎన్నో సాక్ష్యంగా ఉన్నాయి. విజయవాడలో వరద విపత్తు ఏర్పడి మోకాళ్ల లోతు నీళ్లలో బతుకులు నెట్టుకొచ్చిన ప్రజలకు తూతూమంత్రంగా భరోసా ఇచ్చి సీఎం చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. ఈ క్రమంలో విజయవాడ వరద బాధిత ప్రజలకు నేనున్నానంటూ వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రెండు రోజుల పాటు బాధిత ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల పంపిణీ చేయనున్నారు. రోజువారీ ఆహారంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే సరకులను అందించి వైసీపీ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకోనుంది.
విజయవాడ హనుమాన్ పేటలో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జి ఆసిఫ్ పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైఎస్ జగన్ వరద బాధితుల కోసం పార్టీ తరపున అక్షరాలా కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఎన్టీఆర్ జిల్లా నేతలతో, పార్టీ శ్రేణులతో జగన్ సమావేశమై అవసరమైన చర్యలను నిర్దేశించి ఎల్లప్పుడూ పార్టీ తరపున ప్రజలకు అండగా నిలవాలని సూచనలు చేశారు.