Thursday, October 3, 2024

Ys Jagan: టీడీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్

- Advertisement -

Ys Jagan:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిమాణాలు వాడివేడిగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన టీడీపీని వైసీపీ ధీటుగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చర్యలకు, వ్యాఖ్యలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు తమ కౌంటర్లతో సవాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న గుంటూరు సబ్ జైలులో బాపట్ల మాజీ సీఎం నందిగం సురేష్‌ను కలిసి జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చేస్తున్న దారుణాలు, దౌర్జన్యాలను ఎండగడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక దళిత నాయకుడిని అరెస్టు చేయడం కంటే నీచమైన రాజకీయం ఇంకోటి ఉండదంటూ దుయ్యబట్టారు. ఇది అక్రమ అరెస్టు అని, ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షంపైన ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సంప్రదాయంగా మారిందని అన్నారు.

ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని గుర్తు చేస్తూ.. తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారని విమర్శించారు. ఇదే గనక కొనసాగితే తాను అధికారంలోకి రాగానే మీ నాయకులు అందరికీ కూడా ఇదే గతి పడుతుందని, ఇదే జైలులో వేయిస్తానంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వం పదేపదే రెడ్ బుక్ అంటూ ప్రస్తావించడంపై కూడా ఎదురుదాడి చేశారు. రెడ్ బుక్ మైంటైన్ చేయడమనేది ఏదో గొప్ప పని కాదని, ఎవరైనా చేయొచ్చని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఎవరినీ వదలమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోకుండా ప్రతిపక్ష నేతల మీద ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి రాజకీయం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అన్ని విధాలా అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!