YSRCP: 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో విజయదుందుభి మోగించి అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. 2019లో మాత్రం అంతగా తన ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకతాటిపై పార్టీని నడిపించి ప్రజల మనస్సులో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తాజా ఓటమితో రాష్ట్రంలో మళ్లీ పార్టీని పుంజుకునేలా చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీని పునః నిర్మించబోతున్నారా?.. త్వరలోనే వైసీపీని జగన్ సమూలంగా ప్రక్షాళన చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ శ్రేణులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వైఎస్సార్సీపీలో చాలా మంది ప్రముఖ నేతలు అసంతృప్తిలో ఉన్నట్లు జగన్ దృష్టికి వచ్చింది. ఈ మేరకు మళ్లీ వారందరినీ సముదాయించి, పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే పెద్ద నిర్ణయాలే తీసుకోవాల్సి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారట జగన్. మరోవైపు.. వైసీపీ హయాంలో వలంటీర్ వ్యవస్థ అన్ని పనుల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల స్థానిక నేతలకు, కార్యకర్తలకు జనాలకు దగ్గరయ్యే అవకాశం దొరకలేదు. మరికొన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి లీడర్ల పెత్తనాలు భరించలేక కార్యకర్తలు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. అందుకే అట్టడుగు స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని జగన్ యోచిస్తున్నారు. మరి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలో పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో.. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.