Ys jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలకు మరోసారి గుర్తింపు లభించింది. పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించి నిరంతరం అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన, తీసుకున్న సంచలన నిర్ణయాలకు అరుదైన ఆదరణ ఇప్పటికీ లభిస్తోంది. సులభతర వాణిజ్య ర్యాంకులు (ఈవోడీబీ)–2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2022 అమలులో ఏపీ రెండో స్థానంలో నిలవడం విశేషం. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించడం హర్షించదగిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఏపీ పనితీరు భేష్ అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, రాష్ట్రంలో పెట్టుబడులకు అసలు అవకాశమే లేదని కూటమి నేతలు చేసిన అబద్దపు ప్రచారానికి ఈ విజయం చెంపపెట్టులా నిలిచింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా 100 శాతం పారిశ్రామికవేత్తల అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లు మొదటి స్థానంలో నిలవడం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు సంస్కరణల అమలులో ఏపీ రెండో స్థానానికి చేరడమే దీనికి నిదర్శనం. ‘ఏపీ వన్’ పేరుతో సింగిల్ విండో విధానం ఏర్పాటు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్తలను చేయిపట్టుకుని నడిపించిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదే. అందుకే డైకిన్, సెంచురీఫ్లై, ఏటీజీ, దివీస్, అరబిందో వంటి అనేక దిగ్గజ కంపెనీలు గతంలోనే వైసీపీ హయాంలో భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం. తద్వారా సులభతర వాణిజ్యం కోసం రాష్ట్రంలో సంస్కరణలు అమలు చేసి టీడీపీ చేసిన అర్థం లేని ఆరోపణలకు ఈ కేంద్ర ప్రకటనతో బుద్ధి చెప్పినట్లు అయింది.